టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు 'మల్లేశం' మేకర్స్ కొత్త చిత్రం 'పాకా'

Update: 2021-07-29 07:46 GMT
'మల్లేశం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ రాచకొండ.. ''పాకా - ది రివర్ ఆఫ్ బ్లడ్'' అనే మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'మల్లేశం' చిత్రానికి సౌండ్ డిజైనర్ గా వర్క్ చేసిన నితిన్ లూకోస్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ తో కలిసి రాజ్ రాచకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.

రెండు కుటుంబాల మధ్య రగులుతున్న పగ, ద్వేషాల నేపథ్యంలో సాగే కథ ఇదని.. ఈ కథలో ఒక నది ప్రముఖ పాత్ర పోషిస్తుందని.. వారి పగకు ఎరుపెక్కిన ఆ నదిని శాంతింప చేసే ఒక ప్రేమ జంట కథగా ''పాకా'' చిత్రాన్ని చూడొచ్చని దర్శక నిర్మాతలు తెలియచేశారు. ఈ సినిమా ఉత్తర కేరళలోని వయానాడ్ ప్రాంతంలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడింది. ఇందులో బాసిల్ పౌలోస్ - వినీత కోశి - జోష్ కిళక్కన్ - అతుల్ జాన్ - నితిన్ జార్జ్ - జోసెఫ్ మాణిక్కల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

'పాకా' చిత్రానికి శ్రీకాంత్ కబోతు సినిమాటోగ్రఫీ అందించగా.. అరుణిమ శంకర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫైజల్ అహ్మద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. వెంకట్ శిద్దారెడ్డి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. స్టూడియో 99 ఫిలిమ్స్ మరియు ఆలిఫ్ టాకీస్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇకపోతే 'పాకా' చిత్రం ఎన్‌ఎఫ్‌డిసి ఫిల్మ్ బజార్ 2020 లో వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ లో బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డ్ గెలుపొందింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుండి 18 వరకు జరిగే ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్ఎఫ్) 46వ ఎడిషన్‌ లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్న రెండు భారతీయ సినిమాల్లో 'పాకా - రివర్ బ్లడ్' ఒకటి కావడం.. ఆ చిత్రానికి నిర్మాత తెలుగువాడు అవడం గర్వకారణం.


Tags:    

Similar News