'రెడ్'తో గేర్ మార్చేస్తానంటున్న మాళవిక

Update: 2021-01-02 06:00 GMT
మాళవిక శర్మ .. మల్లెపూలకి మరువం చేర్చి కట్టినట్టు, చిట్టి చామంతులపై పన్నీరు చిలకరించినట్టు కనిపిస్తుంది. అందమైన నవ్వుతో వేడెక్కిస్తుంది .. చురకత్తులల్లాంటి చూపులతో మత్తెక్కిస్తుంది. అలాంటి మాళవిక శర్మ 'నేల టిక్కెట్టు' సినిమాతో టాలీవుడ్ తెరకి పరిచయమైంది. ముత్యానికి ముక్కూ చెవులు తగిలించినట్టుగా కనిపించే ఈ అమ్మాయిని చూసి యువకుల్స్  మనసులు పారేసుకున్నారు. అయితే 'నేల టిక్కెట్' పరాజయం పాలుకావడం వలన, ఈ అమ్మాయిపై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టలేదు.

'నేల టిక్కెట్' సినిమా చూసిన వాళ్లు రవితేజ జోడీగా ఈ అమ్మాయి సెట్ కాలేదని తేల్చేశారు. యంగ్ హీరోల జోడీగా ఆడిపాడే ఏజ్ లో ఈ బ్యూటీ అనవసరంగా ఆ సినిమాను చేసిందని కుర్రాళ్లు చెప్పుకున్నారు. మాళవిక సన్నిహితులు కూడా ఇదేమాట చెప్పారేమో, ఆమె ఈ సారి రామ్ తో కలిసి ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' సినిమా రూపొందింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో, ఆయన సరసన మాళవిక అల్లరి చేయనుంది.

'నేల టిక్కెట్' సినిమా ఫ్లాప్ కారణంగా గ్యాప్ రావడంతో డీలాపడిపోయిన ఈ బ్యూటీ, 'రెడ్' సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో ఉంది. రామ్ తో తన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అందరూ అంటున్నారు. రామ్ స్పీడ్ ను అందుకోవడం చాలా కష్టమైందనీ, ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందనిఈ బ్యూటీ చెబుతోంది. ఈ సినిమాతో తన కెరియర్ ఊపందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. కొత్త హీరోయిన్ల రేసులో తాను కూడా ఉన్నాననే విషయాన్ని ఆమె గుర్తు చేస్తోంది. ఈ రేస్ లో ఆమె ఎంతవరకూ పరిగెడుతుందో చూడాలి.
Tags:    

Similar News