ట్రెండీ టాక్‌: టెక్నాల‌జీని - టెక్నిక్‌ని ప‌ట్టుకునే ద‌ర్శ‌కుల‌దే హ‌వా!

మన తెలుగు దర్శకులు కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌లో ఆలోచిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ వర్మ వంటి వారు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మన సత్తా చాటారు.;

Update: 2026-04-29 02:30 GMT

నేటి సినిమా ప్రపంచంలో కేవలం కథాబలం మాత్రమే సరిపోదు.. దానిని వెండితెరపై ఆవిష్కరించే సాంకేతిక పరిజ్ఞానం కూడా అత్యంత కీలకం. తాజాగా వైరల్ అవుతున్న త్రోబ్యాక్ ఇన్‌స్టా వీడియో హాలీవుడ్ స్థాయి ఫిలిం మేకింగ్ ఎంతటి అద్భుతమో మనకు చూపిస్తోంది. ఇందులో హెలికాప్టర్లు ఎగరడం.. డైనోసార్ల కదలికలు.. కుప్పకూలిన బ్రిడ్జి పైనుంచి కార్లు నదిలోకి జారిపడటం వంటి దృశ్యాలు అత్యంత సహజంగా ఉన్నాయి. ఇదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీఐ) అనుకుంటే పొరపాటే.. దీనికోసం `మినియేచర్` అనే టెక్నిక్ ఉప‌యోగించి ఒక ప్రత్యేకమైన చిన్నపాటి ప్రపంచాన్ని నిర్మించి చిత్రీకరించారు.

ఈ వీడియోను విశ్లేషిస్తే.. ఇది ప్రఖ్యాత హాలీవుడ్ ఫ్రాంచైజీ `జురాసిక్ పార్క్` లేదా 1997లో వచ్చిన `ది లాస్ట్ వరల్డ్` మేకింగ్‌కు సంబంధించినదిగా కనిపిస్తోంది. భారీ వంతెనలు కూలడం వంటి సన్నివేశాలను నిజంగా చిత్రీకరించడం ఖర్చుతో కూడుకున్నది.. ప్రమాదకరం కాబట్టి.. హాలీవుడ్ మేకర్లు ఇలాంటి మైక్రో-లెవల్ సెట్లను ఉపయోగిస్తారు. ఇక్కడ `ఫోర్స్డ్ పర్స్పెక్టివ్` అనే టెక్నిక్ ద్వారా చిన్న వస్తువులను కెమెరా యాంగిల్ సహాయంతో తెరపై భారీగా కనిపించేలా చేస్తారు. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. కళాకారుల ఓపికకు.. ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.

ప్రస్తుతం సినిమా ట్రెండ్ మారుతోంది. భవిష్యత్తులో కేవలం డైలాగులు, రొట్ట కామెడీలు లేదా సుత్తి సీన్లతో సినిమాలను నెట్టుకు రావడం కష్టం. ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోబెట్టే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఇచ్చే దర్శకులదే అసలైన హవా. సైన్స్ ఫిక్షన్ .. ఫాంట‌సీలు,.. అడ్వంచ‌ర్లతో విజువల్ బేస్డ్ సినిమాల మేకింగ్ గురించి సరైన అవగాహనతో అద్భుతాలు చేసే ద‌ర్శ‌కుల‌దే హ‌వా. టెక్నాలజీపై పట్టు ఉన్న దర్శకుడు తక్కువ ఖర్చుతో కూడా గరిష్ట స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించ‌గ‌ల‌డు.

మన తెలుగు దర్శకులు కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌లో ఆలోచిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ వర్మ వంటి వారు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మన సత్తా చాటారు. అయితే కేవలం వీళ్లు మాత్రమే కాదు.. ప్రతి దర్శకుడు మారుతున్న సాంకేతికతపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. ఏఐ (AI), యానిమాట్రానిక్స్, బ్లూమ్యాట్-గ్రీన్ మ్యాట్ ఫార్మాట్, వర్చువల్ ప్రొడక్షన్ వంటి అంశాలను అందిపుచ్చుకుంటే.. మన తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్‌ను ఏలడం ఖాయం. టెక్నాలజీపై గ్రిప్ ఉన్నప్పుడే మేకింగ్ ఖర్చును నియంత్రిస్తూ నాణ్యమైన విజువల్స్ ఇవ్వడం ద‌ర్శ‌కుల‌కు సాధ్యమవుతుంది.

ఇంకా చెప్పాలంటే.. నేటి కాలంలో టెక్నాలజీయే అసలైన హీరో. `జురాసిక్ పార్క్` వంటి సినిమాలు కొన్ని దశాబ్దాల క్రితమే అంతటి ఘనవిజయం సాధించాయంటే తెర వెనుక ఉన్న ఇలాంటి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్.. సృజనాత్మకతే కారణం. హాలీవుడ్ - ఇండియ‌న్ సినిమా మ‌ధ్య చాలా గ్యాప్ త‌గ్గుతూ వ‌స్తోంది. సాంకేతికంగా మ‌న‌వాళ్లు చాలా అప్ డేట్ అవుతున్నారు. మన దర్శకులు కూడా పాతకాలపు రొటీన్ ఫార్ములాను వదిలి.. విజువల్ బేస్డ్ కథాంశాలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరైతే సాంకేతికతను కథకు బలంగా మలచుకుంటారో.. వారే రేపటి సినిమా ప్రపంచాన్ని శాసిస్తారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవ‌లి కాలంలో భారీత‌నం నిండిన అవెంజ‌ర్స్, సూప‌ర్ మేన్, బ్లాక్ పాంథ‌ర్, అవ‌తార్, బ్యాట్ మేన్, మ్యాట్రిక్స్, ప్రిడేట‌ర్స్ లేదా ఇంకా ఏవైనా అసాధార‌ణ విజువ‌ల్స్ తెర‌పై క‌నిపిస్తేనే సినిమాలు చూసేందుకు నేటి జెన్ జెడ్ సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌వేళ అంత‌కంటే త‌గ్గి లో- లెవ‌ల్ విజువ‌ల్స్ ని తెర‌పై చూపిస్తామంటే థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేరన్న‌ది గుర్తుంచుకోవాలి. రీల్స్- యూట్యూబ్- ఓటీటీలకు అల‌వాటు ప‌డిన‌ నేటి జెన్ జెడ్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేని ప్ర‌తి ద‌ర్శ‌కుడు ఫెయిల్యూర్‌ని ఎదుర్కొంటారు. కానీ మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు సాంకేతికంగా అప్ డేట్ అవుతూ సినిమాలు తీసేవారిని భ‌విష్య‌త్ వ‌రిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News