లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీలో ‘జీవితం’ ఇలా ఉంటుందా?

Update: 2021-08-21 02:14 GMT
సెలబ్రిటీలైనా.. సామాన్యులైనా వారి పబ్లిక్ లైఫ్ వేరు. ప్రైవేటు లైఫ్ వేరు. బెడ్రూంలో ముచ్చట్లు పబ్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ప్రముఖులైనా సరే. తమ పబ్లిసిటీ కోసం.. లేదంటే తమ ఇమేజ్ ను మరింత పెంచుకోవటానికి.. న్యూస్ మేకర్స్ గా ఉండటానికి చేసే చేష్టలు ఇప్పుడు షాకిస్తున్నాయి. అందరూ అని కాదు కానీ.. కొందరు సెలబ్రిటీలు మర్యాద అనే గీతను ఎడాపెడా దాటేస్తుంటారు. సోషల్ మీడియాలో వారు చేసే ఫోటోలు.. పోస్టులు అన్ని కూడా వ్యూహాత్మకమే తప్పించి.. మరింకేమీ లేవు. ఎందుకంటే.. సామాన్యుల మాదిరి వారంతట వారు.. సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాండిల్ చేయరు. ప్రతి ఒక్కరికి ఒక టీం ఉంటుంది.

వారి సలహాలు.. సూచనలతో వారు పోస్టులు చేస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా రాంగ్ ఛాయిస్ అయితే.. వెంటనే ఆ టీం హెచ్చరిస్తుంది. కుదరకుంటే.. చాలా ఈ పోస్టుకు పెడితే ఇలాంటి సమస్య వస్తుందేమోనని సూచన చేస్తారు. దాని తర్వాత కూడా ఓకే.. ఫర్లేదు.. నేను చూసుకుంటానని చెబితే.. వారు చెప్పినట్లే పోస్టు చేస్తారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పోస్టు చేసే పోస్టులకు సంబంధించి ఇంత తతంగం తెర వెనుక జరుగుతుంది. ఇదంతా చూస్తే.. సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టే ప్రతి పోస్టుకు దానికుండే లెక్కలు దానికి ఉంటాయి. ఇలాంటివేళ వివాదాల వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ చెప్పలేరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వర్మకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు హడావుడి చేస్తుంది. రెండు నిమిషాలకు పైనే నిడివి ఉన్న ఈ వీడియోను చూస్తే.. షాక్ తినాల్సిందే. బర్త్ డే పార్టీ వేళలో.. వర్మ పైత్యం.. అతగాడి తీరును మాత్రమే కాదు.. అతని పక్కనున్న వారి తీరు కూడా అభ్యంతరకరంగానే ఉందని చెప్పాలి. బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయికి పక్కనే ఉన్న జ్యోతి.. వారిద్దరితో వర్మ.. పక్కనే వినయ విధేయత రామలా శ్రీకాంత్ అయ్యంగార్ తీరు.. చుట్టూ మరికొద్ది మంది ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇలాంటి ప్రైవేటు వీడియోల్ని ఎందుకు పబ్లిక్ చేయటం? దాంతో వర్మ ఏం చెప్పాలనుకుంటున్నట్లు? అన్నది ప్రశ్న.

సెలబ్రిటీల మీదా.. సినిమా వాళ్ల మీద తక్కువ అభిప్రాయం కలిగించటానికి ఇలాంటి వీడియోలు కూడా కారణం కాదా? అన్నది ప్రశ్న. లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు కొత్త చర్చకు తావివ్వటమే కాదు.. వర్మ తీరు భరించలేనిదిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పైత్యం పరాకాష్ఠకు చేరినట్లుగా చెప్పాలి. మొన్నటికి మొన్న జూనియర్ సమంతగా చెప్పే అన్షును షాకింగ్ యాంగిల్లో ఫోటో తీసే ఫోటోను సోషల్ మీడియాలో అచ్చేసుకొని వార్తల్లోకి వచ్చిన వర్మ.. తాజాగా పోస్టు అయిన వీడియో చూస్తే.. ఆయన హద్దులన్ని దాటేస్తున్నారన్న భావన కలుగక మానదు.

చనువుగా ఉండే ప్రైవేటు వీడియోల్ని ఇంట్లో ఉన్న హోం థియేటర్లో పెద్ద పెద్ద బొమ్ములుగా వేసుకొని చూసుకుంటే తప్పు లేదు. కానీ.. పబ్లిక్ డొమైన్ లో పెట్టటం ద్వారా.. ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు? అన్నది అసలు ప్రశ్న. తన సినిమాలతో సమాజానికి మంచి చేయాలన్న నీతిబోధ చేయటం లేదు కానీ.. సెలబ్రిటీల మీదా.. సినీ తారల మీద చిన్నచూపు కలిగేలా.. వారి పట్ల గౌరవ మర్యాదలు తరిగిపోయేలా వ్యవహరించటం సరికాదు. ఈ విషయాన్ని వర్మ ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకొని.. తప్పైందని చెంపలేసుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News