తరగని గ్లామర్ .. తగ్గని ఛాన్సులు .. ఖుష్బూ సొంతం!

Update: 2022-03-04 23:30 GMT
సాధారణంగా వయసుతో పాటే గ్లామర్ తగ్గుతూ ఉంటుంది .. గ్లామర్ తో పాటే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ కొంతమంది హీరోయిన్ల విషయంలో మాత్రం వయసు పెరిగినా వన్నె తగ్గదు. కొత్తగా ఎంతమంది ఎంట్రీ ఇస్తున్నా వీరికి వచ్చే ఛాన్సులు ఆగవు.

అలాంటి కథానాయికల జాబితాలో ఖుష్బూ ఒకరు. 80 - 90లలో గ్లామర్ అంటే ఇది అని వెండితెరకి పరిచయం చేసిన కథానాయిక ఆమె. అప్పట్లో అందరూ ఆమె అభిమానులే .. ఆరాధకులే. తెరపై ఖుష్బూ కనిపిస్తే పొద్దుతిరుగుడు పూలను పేర్చినట్టుగా కళకళలాడుతూ కనిపించేది.

తెలుగు తెరకి వెంకటేశ్ 'కలియుగ పాండవులు' సినిమాతో ఆమె పరిచయమైంది. ఆ తరువాత నాగార్జున సరసన నాయికగా చేసిన 'కిరాయిదాదా' సినిమా కూడా ఆమెకి మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత తెలుగు తెరపై ఆమె హవా కొనసాగలేదు.

అందుకు కారణం అవకాశాలు లేకపోవడం .. రాకపోవడం కాదు. తమిళంలో వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేయడమే. తమిళ దర్శక నిర్మాతలు .. అభిమానులు ఆమెకి మరో సినిమాలో చేసే సమయం ఇవ్వలేదు. అక్కడ వరుస విజయాలతో ఆమె తిరుగులేని కెరియర్ ను కొనసాగించింది.

తమిళంలో ఎంతోమంది హీరోయిన్లు స్టార్ డమ్ ను అందుకున్నారు. కానీ వాళ్లలో ఖుష్బూ స్థానం ప్రత్యేకం. ఆమె అందచందాలకు ముచ్చటపడిన అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టేశారు. అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆమె, ఆ గ్లామర్ ను ఇప్పటికీ అలాగే కాపాడుకుంటూ వస్తోంది.

అందువల్లనే అవకాశాలు ఆమెను పట్టుకుని వ్రేళ్లాడుతూనే ఉన్నాయి. తెలుగులో 'స్టాలిన్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత 'యమదొంగ' .. 'అజ్ఞాతవాసి' సినిమాల్లోను ముఖ్యమైన పాత్రలను పోషించింది.  

ఇక ఆమె ముఖ్యమైన పాత్రను పోషించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రష్మిక తల్లిగా తన పాత్ర ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది.

ఇక గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. మరో రెండు తెలుగు సినిమాలు చేతిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే టాలీవుడ్ పై ఖుష్బూ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగానే కనిపిస్తోంది. గ్లామర్ పరంగా .. క్రేజ్ పరంగా .. డిమాండ్ పరంగా .. పారితోషికం పరంగా ఇంత కాలం పాటు ఆమె తన ప్రత్యేకతను చాటుతుండటం నిజంగా విశేషమేనని చెప్పాలి.   
Tags:    

Similar News