మహేష్ ఫ్లాపులపై కొరటాల వివరణ

Update: 2018-05-01 05:33 GMT
మహేష్ కెరీర్లో డిజాస్టర్లకు కొదవలేదు. గత ఐదేళ్ల కాలాన్నే తీస్తే అందులో నాలుగు డిజాస్టర్లున్నాయి. అవి మామూలు డిజాస్టర్లు కూడా కావు. నష్టాల పరంగా టాలీవుడ్లో కొత్త రికార్డులు నెలకొల్పుతూ వెళ్లాయి అతడి సినిమాలు. ఈ విషయంలో మహేష్ ఎంతగా డిప్రెస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అందరూ తనను సూపర్ స్టార్ అంటారని.. కానీ ఈ సూపర్ స్టార్‌ కు నాలుగేళ్లలో రెండుసార్లు లైఫ్ ఇచ్చాడంటూ కొరటాలను కొనియాడటం మహేష్ పరిస్థితిని తెలియజేస్తుంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ నాలుగు సినిమాల అనుభవమున్న ఒక దర్శకుడి గురించి అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదే విషయం కొరటాల దగ్గర ప్రస్తావిస్తే దండం పెట్టేశాడు. అలా మాట్లాడటం మహేష్ గౌరవమని.. ఆ మాటల్ని తాను అంగీకరించలేనని అన్నాడు.

అసలు మహేష్ బాబుకు అలా డిజాస్టర్లు ఎందుకు వచ్చాయనే విషయమై కొరటాల తన అభిప్రాయం చెప్పాడు. మహేష్ తన సినిమాల్లో ఏ రెండు సన్నివేశాలూ ఒకలా ఉండాలని కోరుకోడని.. చాలా వైవిధ్యం కోరుకుంటాడని.. ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా ఉండాలని ఆశిస్తాడని కొరటాల చెప్పాడు. సన్నివేశాల విషయంలోనే ఇలా ఆలోచించే మహేష్.. సినిమాల విషయంలో ఇంకెలా ఆలోచిస్తాడో అర్థం చేసుకోవచ్చని.. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగలొచ్చని కొరటాల అన్నాడు. మహేష్ లాంటి హీరో దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమే అని.. మన కథను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లే నటుడు అతడని కొరటాల అభిప్రాయపడ్డాడు. అసలు ఏ రచయిత అయినా.. దర్శకుడైనా మహేష్ ను దృష్టిలో ఉంచుకుని కథ రాస్తే చాలా బాగా రాయాలన్న స్ఫూర్తి కలుగుతుందని కొరటాల అన్నాడు.

Tags:    

Similar News