ఆ డైలాగులు రాస్తున్నపుడు కొరటాల భయం

Update: 2018-04-24 08:18 GMT
రచయితగా ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా మారి.. గొప్ప పేరు సంపాదించిన వాళ్లలో కొరటాల శివ ఒకడు. కేవలం నాలుగు సినిమాలతో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడతను. కొరటాలకు రచయితగా అవకాశాలిచ్చి అతడి ఎదుగుదలకు కారణమైన వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఆ కృతజ్ఞతను తన మాటల్లో ఎప్పుడూ చూపిస్తుంటాడు కొరటాల. తాజాగా కొరటాల తీసిన ‘భరత్ అనే నేను’ సినిమాలో పోసాని కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. అతను అవినీతి మంత్రి పాత్రలో కనిపించాడు. కొరటాల సినిమాలో పోసాని నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తన గురువు అంటే తనకు చాలా భయమని.. అందుకే ఇన్ని రోజులూ ఆయనతో పని చేయడానికి వెనుకంజ వేశానని కొరటాల చెప్పాడు. తొలిసారి ఆయనకు ‘భరత్ అనే నేను’లో ఒక పాత్ర ఇచ్చానని ఆయన తనదైన శైలిలో ఈ పాత్రను పోషించాడని కొరటాల చెప్పాడు. ఈ చిత్రంలో మిగతా పాత్రలకు డైలాగులు ఈజీగానే రాసేశానని.. కానీ పోసాని పాత్రకు మాటలు రాయడానికి మాత్రం భయపడ్డానని చెప్పాడు. ఆయన తన గురువు కావడం.. మాటలు రాయడం నేర్పింది కూడా ఆయనే కావడంతో ఆ పాత్రకు డైలాగ్స్ రాయడానికి ఇబ్బంది పడ్డానని.. భయపడ్డానని కొరటాల చెప్పాడు. మరి తాను రాసిన మాటల విషయంలో పోసాని ఫీలింగ్ ఏంటో తెలియదని అన్నాడు.
Tags:    

Similar News