శివాలెత్తిన కంగ‌న ర‌నౌత్‌!

Update: 2019-02-08 08:57 GMT
'మ‌ణిక‌ర్ణిక' వివాదంతో వార్త‌ల్లో నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కంగ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం బాలీవుడ్‌ లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. బాలీవుడ్‌ కు సంబంధించిన ఒక్కొక్క‌రి బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌ని - ఒక్కొక్క‌రి శృంగార జీవితాల‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌ని -  ప్రతీ విష‌యంలోనూ న‌న్ను ఒంట‌రిని చేసి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని  తీవ్రంగా హెచ్చ‌రించింది. త‌న సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మానికి సినిమాలో న‌టించిన న‌టుల‌తో పాటు న‌టీమ‌ణులు రాక‌పోవ‌డం - ఇత‌ర సెట‌బ్రిటీలు ప్ర‌చార వేదిక‌ల్లో పాలుపంచుకోవ‌డానికి రాక‌పోవ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

నా సినిమా ప్ర‌చారం కోసం వేరే సెల‌బ్రిటీలు రావాల్సిన అవ‌స‌రం ఏముంది?. అందువ‌ల్ల నాకు క‌లిగే లాభం ఏమిటో నాకు అర్థం కావ‌డం లేదు. న‌టిగా ఇప్ప‌టికే నాలుగు జాతీయ పుర‌స్కారాల్ని సొంతం చేసుకున్నాను. 31 ఏళ్ల‌కే ద‌ర్ఠ‌వ‌కురాలిగా నా స‌త్తా ఏంటో నిరూపించుకున్నాను. ఎవ‌రి సినిమాల‌కు వారు ప్ర‌చారం చేసుకుంటే చాలు. మిగ‌తా వారి సినిమాలో వేలు పెట్ట‌కుంటేనే మంచిది. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్‌ కి నేను ఎంతో మిగ‌తా వారూ అంటే ఆమె నాకు చుట్ట‌ము కాదు. నేను బంధుప్రీతి గురించి మాట్లాడాను కాబ‌ట్టి దానిపై మాట్లాడ‌టానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. భ‌య‌ప‌డుతున్నారు.

నాకు వ్య‌తిరేకంగా ఓ గ్యాంగ్‌ ను త‌యారు చేశారు - అలాంటి వారికి క‌నీసం సిగ్గ‌నేదే వుండ‌దా? వారిలో కొంద‌రు వృద్ధులు కూడా వున్నారు.  అలాంటి వారితో నేను క‌లిసి ప‌నిచేయాల‌నుకోవ‌డం లేదు. ఈ విష‌యాన్ని వారికి కూడా చెప్పాను. త్వ‌ర‌లో ఒక్కొక్క‌రి బండారం బ‌య‌ట‌పెడ‌తా. నేను మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే వారు నాతో శ‌తృత్వం పెంచుకుంటున్నారు` అంటూ కంగ‌న నిప్పులు చెరిగింది. ఉన్న‌ట్టుండి కంగ‌న ఎందుకిలా ఫైర్ అవుతోంది? తెర‌వెన‌క ఆమెపై బాలీవుడ్‌ లో కొత్త కుట్ర జ‌రుగుతోందా? అన్న‌ది తెలియాలంటే కంగ‌న బ‌య‌ట‌పెట్టే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News