లోక‌నాయ‌కుడు `క్ష‌త్రియ‌పుత్రుడు 2`

Update: 2018-10-13 12:38 GMT
క్ష‌త్రియుడు అంటే రౌద్రం ఉన్న‌వాడు అని అర్థం. రాజుల్ని క్ష‌త్రియులు అంటారు. క్ష‌త్రియ వంశంలో వీర‌త్వ ల‌క్ష‌ణాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. లైఫ్‌లో ఎదురయ్యే ఏ ఉత్పాతాన్ని అయినా క్ష‌త్రియులు ఎదుర్కొనే శైలి వేరుగా ఉంటుంది. స‌రిగ్గా ఇదే పాయింట్‌ని బేస్ చేసుకుని  క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కించిన‌ చిత్రం క్ష‌త్రియ పుత్రుడు. త‌మిళంలో తెవ‌ర్‌మ‌గ‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దించి 1992లో రిలీజ్ చేశారు. మూలచిత్రానికి కమల్ హసన్ నిర్మాతగా, రచయితగా వ్యవహరించి నటించారు. సినిమాలో కమల్ హసన్, శివాజీ గణేశన్, రేవతి, గౌతమి తార‌గ‌ణం. స్వ‌ర‌మాంత్రికుడు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. తమిళ వెర్ష‌న్‌ అద్భుత విజయాన్ని సాధించి 175 రోజులు ప్రదర్శితం కాగా, తెలుగు అనువాదం అంతే పెద్ద విజయవంతమైంది.

అస‌లు ఆస్కార్ కు మ‌న ద‌క్షిణాది నుంచి సినిమా ఏది? అనుకుంటున్న టైమ్‌లో అప్ప‌ట్లోనే 65వ అకాడమీ అవార్డులకు గాను సినిమాను భారతదేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రంగా అధికారిక ఎంట్రీగా పంపారు. 1994 సంవత్సరపు టొరంటొ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రం ప్రదర్శితమైంది. ఈ సినిమా 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకుంది. వాటిలో ఉత్తమ తమిళ చిత్రం పురస్కారం, ఉత్తమ సహాయనటి పురస్కారం (రేవతి), ప్రత్యేక జ్యూరీ పురస్కారం (శివాజీ గణేశన్) ఉన్నాయి. 1972నాటి అమెరికన్ చలనచిత్రం గాడ్ ఫాదర్ అడాప్టేషన్ అని కొందరు వాదించిన సంద‌ర్భాలున్నాయి. తెవర్ మగన్ తర్వాతి కాలంలో హిందీలోకి ప్రియదర్శన్ దర్శకత్వంలో విరాశత్(1997)గానూ, కన్నడలోకి ఎస్.మహేందర్ దర్శకత్వంలో తెండెగె తక్క మగ(2006)గానూ రీమేక్ అయింది.

అంత‌టి చ‌రిత్ర ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తేవ‌ర్‌మ‌గ‌న్ 2 (క్ష‌త్రియ‌పుత్రుడు 2) పేరుతో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌ని భార‌తీయుడు 2 పూర్తి కాగానే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు క‌మ‌ల్ హాస‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి క‌థ రెడీ అవుతోంది. ఇటీవ‌లే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో క‌మల్ క్ష‌త్రియ‌పుత్రుడు సీక్వెల్ గురించి  వెల్లడించారు. భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళుతామ‌ని తెలిపారు.
Tags:    

Similar News