కమల్ ఎంత తెలివిగా తప్పించుకున్నాడంటే..

Update: 2017-02-19 09:10 GMT
తమిళనాట జయలలిత మరణం తర్వాతి పరిస్థితులు అక్కడి ప్రముఖులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడూ ఆత్మాభిమానం గురించి మాట్లాడే తమిళులకు.. ఇప్పుడు తమ రాష్ట్రంలోని పరిస్థితులపై దేశవ్యాప్తంగా హేళనగా మాట్లాడుతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తమ రాష్ట్రం పరువు పోతోందని అందరూ చాలా ఫీలవుతున్నారు. కమల్ హాసన్ లాటి వాళ్లయితే ప్రస్తుత పరిస్థితులు చూసి కోపం పట్టలేకపోతున్నారు. ప్రస్తుత పరిణామాలపై ఆయన ప్రతి రోజూ మాట్లాడుతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం తమిళనాడులో ఒకరకమైన రాజకీయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో కమల్ హాసన్ లేదా రజినీకాంత్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే సులువుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు. జనం వారికి బ్రహ్మరథం పడతారు. కానీ వాళ్లిద్దరూ కూడా తాము రాజకీయాలకు దూరం దూరం అంటున్నారు.

రజినీకాంత్ అసలు ఏ రాజకీయ పరిణామాలపైనా నోరే విప్పడసలు. కమల్ మాట్లాడతాడు కానీ.. ఆయన కూడా తాను రాజకీయాల్లోకి రానంటాడు. ఐతే గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా కమల్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై జనాలు బాగానే స్పందిస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి రాకుండా అందరినీ తిట్టడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కమల్ సమాధానం ఇచ్చాడు. ‘‘నేను చాలా కోపస్తుడిని. నేను రాజకీయాలకు సరిపోను. కోపంతో ఉండే వ్యక్తులు రాజకీయాలకు అవసరం లేదు. రాజకీయ నాయకులంటే గొప్ప సమతౌల్యం పాటించేవారిగా ఉండాలి. ఇప్పుడు నేను చాలా కోపంతో ఉన్నాను’’ అంటూ కమల్ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక ప్రస్తుత పరిణామాలపై కమల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన జయలలితను కూడా టార్గెట్ చేశాడు. ‘‘నిజమేంటో కోర్టు పదేపదే తేల్చి చెప్పింది. శశికళే కాదు.. చనిపోయిన జయలలిత కూడా అక్రమాస్తుల కేసులో దోషి అని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీని ఫ్లోర్‌ ను శుభ్రం చేయాల్సి ఉంది. ప్రజల వద్దకు ఎన్నికలు తీసుకెళ్లండి. వారి మనసులో ఏముందో చెప్తారు’’ అని కమల్ అన్నాడు. ఐతే కమల్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మార్పు తెచ్చే ప్రయత్నం చేయకుండా ఇలా ఎన్ని మాటలు చెబితే ఏం ప్రయోజనం అంటున్నారు తమిళ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News