ఔను.. తాతగారు పెట్టారు -ఎన్టీఆర్

Update: 2016-01-26 18:30 GMT
‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్లో హరికృష్ణ వ్యాఖ్యలు చెప్పిన ఓ విషయం అందరిలో ఎంతో ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఎన్టీఆర్ తన కొడుక్కి తన పేరును దానమిచ్చారని ఆయన చెప్పడం టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఐతే ఆ సంఘటనకు సంబంధించి హరికృష్ణ మరీ డీప్ గా ఏమీ వివరాలు వెల్లడించలేదు. ఐతే ఓ ఇంటర్వ్యూలో భాగంగా నాడు అసలేం జరిగిందన్నది ఎన్టీఆర్ వెల్లడించాడు. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.

‘‘నా పదకొండో ఏట అనుకుంటా. పొద్దున్నే ఇంకా మంచం కూడా దిగలేదు. అప్పుడు ఒంట్లో కూడా బాలేదు. ఐతే అమ్మ సడెన్ గా గదిలోకి వచ్చి తట్టి లేపింది. ‘ఏంటమ్మా ఇంత పొద్దుటే..’ అంటూ విసుక్కున్నా. ‘తాతగారు నిన్ను రమ్మంటున్నారు’ అంది అమ్మ. నిజంగానే నాకేమీ అర్థం కాలేదు. ‘తాతగారేంటి నన్ను పిలవడమేంటి’ అనుకున్నా. తాతయ్యంటే నాకు దైవం. నా ప్రపంచమే ఆయన. కానీ అప్పటివరకు తాతయ్యను ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆయన గురించి తలుచుకోవడమే తప్ప కలుసుకోలేదు. అమ్మ చకచకా స్నానం చేసి, ముస్తాబు చేసింది.

అప్పట్లో తాతయ్య అబిడ్స్ లో ఉండేవారు. కార్లో తాతయ్య ఇంటికెళ్లాను. ఆయన గది ముందు వదిలిపెట్టారెవరో. తలుపు చాటు నుంచి తాతయ్యను తొలిసారి చూశా. ‘రండి’ అని గంభీరంగా అన్నారు. భయం, ఆశ్చర్యం, ఆనందం.. అన్నీ ఒకేసారి కలిగాయి. పేరేంటి అని అడిగారు. ఆయన నాతో మాట్లాడిన తొలి మాట అదే. ‘తారక్ రామ్’ అన్నారు. వెంటనే నాన్నగారిని పిలిచి.. పేరు మార్చండి. నందమూరి తారకరామారావు అని పెట్టండి’ అని ఓ ఆర్డర్ లాంటిది వేశారు. అప్పటి నుంచి తారక్ రామ్ ను కాస్తా ఎన్టీఆర్ అయిపోయా. ఆ క్షణం నుంచి తాతయ్య చేయి వదల్లేదు. చాలారోజులు ఆయనతో పాటు ఆయనింట్లోనే గడిపా’’ అంటూ తన పేరు వెనుక కథ వెల్లడించాడు ఎన్టీఆర్.
Tags:    

Similar News