ఆంగ్ల మాధ్య‌మం వ‌ద్ద‌న్న‌ మంచు ల‌క్ష్మి.. కార‌ణ‌మిదేనా?

Update: 2020-06-13 04:15 GMT
గ‌వ‌ర్న‌మెంటు స్కూళ్ల‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఎప్ప‌టికీ హాట్ టాపిక్. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్ర‌దేశ్ ఇరు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మార్చాల‌న్న ఆలోచ‌న ప్ర‌భుత్వాల‌కు ఉంది. ధ‌న‌వంతుల బిడ్డ‌ల‌కు ధీటుగా పేద‌ల బిడ్డ‌లు చదువుకుంటే తార‌త‌మ్యం త‌గ్గించే వీలుంటుంద‌ని భావించే ముఖ్య‌మంత్రులు ఉన్నారు. కానీ ప్ర‌త్య‌ర్థి వ్య‌వ‌స్థలు అంగీక‌రించడం లేదు. ప్ర‌తి పిల్లాడిని ఇంగ్లీష్ మీడియంలో చ‌దివించాల‌ని త‌ల్లిదండ్రులు భావిస్తున్నా కానీ ఆ ఆలోచ‌న‌ల్ని వ్య‌తిరేకించే వ్య‌వ‌స్థ‌లు పోగుప‌డ్డాయి. ముఖ్యంగా ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్ని న‌డిపించేవాళ్లు ఎప్ప‌టికీ దానిని హ‌ర్షించ‌రు. కార్పొరెట్ స్కూళ్లు వాటిని న‌డిపించేవాళ్లు అందుకు పూర్తి వ్య‌తిరేకం.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే ఇంగ్లీష్ విద్య‌ను నేర్పించేస్తే అది ప్ర‌యివేటుకు తీర‌ని న‌ష్టం. ఇన్నాళ్లు ప్ర‌భుత్వాల్ని శాసించిన మంత్రుల‌కు.. బ‌డా కార్పొరెట్ కు ఉన్న చెయిన్ స్కూళ్లు కాలేజ్ లు దెబ్బ తినేస్తాయి. అందుక‌ని వ్య‌తిరేకిస్తుంటారు. దానికి ఎలాంటి షాకులు చెబుతారు? అన్న‌ది కూడా ప‌రిశీలించ‌ద‌గ్గ‌దే.

తాజాగా `లాక్ అప్ విత్ మంచు ల‌క్ష్మి` షోలో శ్రీ‌విద్యానికేత‌న్ (తిరుప‌తి) పాఠ‌శాల‌ల్ని నిర్వ‌హిస్తున్న మంచు వార‌సురాలు మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న చెప్పిన మాటల్ని ప‌రిశీలిస్తే `ప్ర‌యివేటు కార్పొరెట్ సైకాల‌జీ` అర్థ‌మ‌వుతుంది. ``ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా పరిచయం చేయాలనే ఆలోచన నాకు నచ్చదు. చాలా మంది ఉపాధ్యాయులకు ప్రాథమిక విషయాలు కూడా తెలియవు. విద్యావేత్తగా నేను ఇంగ్లీషు నేర్పిస్తే చాలు అన్న‌ది నా అభిప్రాయం`` అని తెలిపారు. అంతేకాదు.. ``ప్రైవేట్ పాఠశాలలు మ‌హ‌మ్మారీ క్లిష్ఠ స‌మ‌యంలో కనీసం ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపైనే నా ఆందోళ‌న‌`` అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కారు.

ఒక‌టి మంచు ల‌క్ష్మి తెలిసి మాట్లాడారో.. తెలియ‌క మాట్లాడారో కానీ.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల టీచ‌ర్లు అంతా స‌న్నాసులు అన్న అర్థంలోనే మాట్లాడారు. వీరికి ఆంగ్లం తెలియ‌ద‌ని నేర్చుకోలేర‌ని చెప్ప‌క‌నే చెప్పారు. దానికి తోడు అస‌లు వీళ్ల‌కు ప్రాథ‌మిక విజ్ఞానం కూడా లేద‌ని తేల్చేశారు. ప్ర‌భుత్వ టీచ‌ర్ అంటే మ‌రీ అంత స‌న్నాసులా?   డిగ్రీలు ఇంగ్లీష్ మాధ్య‌మంలో చ‌ద‌వ‌నివాళ్లున్నారా?  బీ-ఎడ్ లో సైకాల‌జీ లాంటి క్లిష్ట‌మైన స‌బ్జెక్టుని ఔపోష‌ణ ప‌ట్ట‌నివాళ్లు ప్ర‌భుత్వ టీచ‌ర్ కాగ‌ల‌రా?  ఎన్నో కాంపిటీటివ్ ప‌రీక్ష‌లు రాసి పోరాడి చివ‌రికి ఉద్యోగం సంపాదించే టీచ‌ర్ల‌ను తూల‌నాడి ఎలాంటి అర్హ‌తా లేని ప్ర‌యివేటు టీచ‌ర్లు గొప్ప అన్న‌ట్టుగానే మాట్లాడారు. ఇక ఆన్ లైన్ పాఠాలు నేర్పే స‌త్తా గ‌వ‌ర్న‌మెంటు స్కూళ్ల‌కు లేద‌ని తేల్చేశారు. మొత్తానికి మంచు ల‌క్ష్మి అప‌రిప‌క్వ‌త బ‌య‌ట‌ప‌డింది. ఇక ప్ర‌భుత్వ స్కూళ్ల‌లోనే ఇంగ్లీష్ విద్య‌ను నేర్పించేస్తే  ప్ర‌యివేటు స్కూళ్ల గ‌తి ఏం కావాలి? అన్న ఆందోళ‌నా బ‌య‌ట‌ప‌డింది. ఒక ప్ర‌యివేట్ స్కూల్ నిర్వాహ‌కురాలిగా... దొరికిపోయారు. నిర్భంధ ఆంగ్ల విద్య స‌రికాదేమో కానీ అనాల్సింది పోయి ఇంకేదో చెప్ప‌బోయ అడ్డంగా దొరికిపోయార‌న్న‌మాట‌.

Tags:    

Similar News