హరికృష్ణకు ఆ క్రేజ్ షాకింగే..

Update: 2018-08-30 07:11 GMT
రోడ్డు ప్రమాదంలో నిన్న దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ రాజకీయాల్లోనే కాక సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కానీ ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే. తండ్రి వారసత్వాన్ని అందుకుని బాల నటుడిగా నటించి మెప్పించిన హరి.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ‘దానవీర శూర కర్ణ’లోనూ కీలక పాత్ర చేశారు. ఐతే ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం చేశాక ఆయన వెన్నంటే ఉంటూ రాజకీయాల్లో బిజీ అయిపోయిన హరికృష్ణ.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఇక ఆయన తిరిగి మేకప్ వేసుకోరనే అనుకున్నారంతా. కానీ 90ల్లో అనూహ్య రీతిలో రాజకీయ అస్త్ర సన్యాసం చేశాక తిరిగి సినిమాల వైపు చూశారు.

‘శ్రీరాములయ్య’.. ‘సీతారామరాజు’ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఐతే ఇలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయాలే తప్ప హరికృష్ణను హీరోగా చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు. యుక్త వయసులో సైతం హీరోగా నటించని హరి.. అనూహ్యంగా 40 ఏళ్లు పైబడ్డాక హీరో అయ్యారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’లో హీరో కాని హీరోగా నటించారు. ఆ చిత్రంపై అప్పటికి అసలేమాత్రం అంచనాల్లేవు. వైవీఎస్ చౌదరి నిర్మాతగా మారి ఎంతో సాహసోపేతంగా ఈ సినిమా తీశాడు. బడ్జెట్ సమస్యలు తలెత్తి... సినిమాను ఎవరూ కొనక ఇబ్బంది పడ్డారు. అన్ని అడ్డంకుల్నీ అధిగమించి అతి కష్టం మీద సినిమాను రిలీజ్ చేస్తే అనూహ్యంగా పెద్ద హిట్టయింది. హరికృష్ణకు క్రేజ్ వచ్చింది.

ఈ చిత్రం అప్పట్లో 40కి పైగా కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా రిలీజైన మరుసటి రోజే.. శతదినోత్సవ వేడుకల గురించి ప్రకటన ఇచ్చి ఆశ్చర్యపరిచాడు చౌదరి. దీని తర్వాత హరికృష్ణను సోలో హీరోగా పెట్టి ‘సీతయ్య’ సినిమా అనౌన్స్ చేస్తే దానికి అప్పట్లో బంపర్ క్రేజ్ వచ్చింది. భారీ స్టార్ కాస్టింగ్.. బడ్జెట్లో ఈ చిత్రాన్ని రూపొందించాడు చౌదరి. ఈ చిత్ర ఆడియో అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. అలాగే ఈ సినిమాకు ఒక స్టార్ హీరో చిత్రానికి వచ్చినట్లుగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకైతే రిలీజ్ రోజు ఉదయమే శత దినోత్సవ వేడుకల గురించి ప్రకటన ఇచ్చిన కాన్ఫిడెన్స్ చౌదరిది. ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయినా.. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. పెట్టుబడి వెనక్కి తెచ్చింది. ఐతే చిత్రంతో వచ్చిన క్రేజ్ ను హరికృష్ణ నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయన సినిమాలు అంతగా ఆడలేదు. అదే సమయంలో ఆరోగ్యం దెబ్బ తిని.. లుక్ కూడా తేడా వచ్చేయడంత సినిమాలు మానేశారు హరి.
Tags:    

Similar News