4000 కోట్ల బడ్జెట్ సినిమాలో ఆఫ‌ర్ కోల్పోయాడు

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో `యానిమల్` సినిమాతో ఒక భారీ ఊపు అందుకున్నారు.;

Update: 2026-03-17 02:30 GMT

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో `యానిమల్` సినిమాతో ఒక భారీ ఊపు అందుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన బిగ్ బ్రేక్ తర్వాత అత‌డికి దక్షిణాది నుంచి కూడా వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకానొక సమయంలో తినడానికి, జీవించడానికి తన భార్యను డబ్బు అడగాల్సిన దుర్భర స్థితిని అనుభవించిన బాబీ ఇప్పుడు మళ్లీ బిజీ స్టార్‌గా మారారు. అయితే తాజాగా ఒక భారీ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `రామాయణం` సినిమా నుంచి బాబీ డియోల్ ఆఫర్ కోల్పోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఫ్రాంచైజీలో బాబీ ఒక కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ఇలాంటి గొప్ప అవకాశం చేజారడం బాబీ కెరీర్‌కు ఒక రకమైన మైనస్ అని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

తాజా వార్తా క‌థ‌నాల‌ ప్రకారం.. రామాయణంలో రావణుడి తమ్ముడు `కుంభకర్ణుడు` పాత్ర కోసం బాబీ డియోల్ పేరును పరిశీలించారు. కానీ బాబీ స్థానంలో ఫైసల్ మాలిక్ అనే నటుడిని చిత్రబృందం ఖరారు చేసింది. పాపులర్ వెబ్ సిరీస్ `పంచాయత్` ద్వారా గుర్తింపు పొందిన ఫైసల్ మాలిక్ ఈ భారీ పౌరాణిక చిత్రంలో కుంభకర్ణుడిగా కనిపించబోతున్నారు. అత‌డి భారీ దేహధారుడ్యం, ఎత్తు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని నితేష్ తివారీ భావించార‌ట‌.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ముంబైలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోలో ప్రారంభమైంది. అంతర్జాతీయ యాక్షన్ టీమ్‌తో కలిసి ఫైసల్ మాలిక్ తన పరిచయ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రం`అవతార్` తరహాలో గ్రాఫిక్స్‌తో నిండి ఉండబోతున్నాయని.. న‌టీన‌టుల‌ బాడీ లాంగ్వేజ్- లుక్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. బాబీ లాంటి స్టార్ కాకుండా ఫైసల్ లాంటి నటుడిని తీసుకోవడం వెనుక పాత్ర స్వభావమే ప్రధాన కారణమా? ఇంకేదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌లు దేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసినా కానీ మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా కొన్ని షెడ్యూల్స్, అధికారిక ప్రకటనలు ఆలస్యమవుతూ వస్తున్నాయి.

రామాయణం మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుండగా..రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఇంతటి భారీ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యే అవకాశం కోల్పోవడం బాబీ డియోల్ అభిమానులను కొంత నిరాశకు గురిచేసినా.. ఫైసల్ మాలిక్ లాంటి కొత్త టాలెంట్ ఈ పాత్రకు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News