తెలుగు తెరపై విరిసిన తెల్ల తామర

Update: 2020-12-15 03:17 GMT
తెలుగు తెరకు నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో 'లావణ్య త్రిపాఠి' ఒకరు. 'అందాల రాక్షసి' సినిమా ద్వారా ఈ సుందరి తెలుగు తెరకు పరిచయమైంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రంలో ఆమె 'మిథున' పాత్రలో మెరిసింది. తెరపై పూతరేకులా .. తమలపాకులా పలచని సౌందర్యంతో కనిపించిన ఈ అమ్మాయి, పడచు మనసులను దోచేసింది. పాలవానలో తడిసిన పాలరాతి శిల్పంలా కనిపించే ఆ అమ్మాయిని చూసిన కుర్రాళ్లందరూ మనసులు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి వాటికోసం అలా వెతుకుతూనే ఉన్నారు. అంతగా తొలి సినిమాతో లావణ్య త్రిపాఠి తన ప్రభావాన్ని చూపింది.

ఉత్తరప్రదేశ్ .. 'అయోధ్య'లో పుట్టిన ఈ అమ్మాయి, 'డెహ్రాడూన్'లో పెరిగింది. 'ముంబై'లో చదువు పూర్తిచేసిన ఈ బ్యూటీ, ఉత్సాహంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అలా గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి, తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రకుల్ .. రాశి ఖన్నా .. రెజీనా దూకుడు చూపుతున్నప్పటికీ, తనదైన ప్రత్యేకతను చూపుతూ ముందుకువెళ్లింది. అదృష్టం కలిసొచ్చిన అందానికే ఆరాధకులు ఎక్కువ అన్నట్టుగా ఈ సుందరికి అదృష్టం కూడా తోడైంది .. ఆరాధకులూ పెరిగారు.

'అందాల రాక్షసి' తరువాత లావణ్యను వరుస అవకాశాలు పలకరించాయి. 'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో వరుస విజయాలను తన సొంతం చేసుకుంది. ఈ మూడు సినిమాల్లో ఆమె పాత్రలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఎంతో విభిన్నంగా కనిపిస్తాయి. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఎక్కడా వంకబెట్టడానికి వీలులేని విధంగా ఆమె అలరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెరపై తెల్ల తామరలా తేలుతున్న ఈ అమ్మాయిని చూసిన కుర్రాళ్లంతా కోటిదీపోత్సవం జరుపుకున్న అనుభూతిని పొందారు.     

చిలిపికళ్లతో .. సొట్టబుగ్గలతో కుర్రాళ్ల ఊహలను వేడెక్కించిన లావణ్య, స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు .. అందుకు కారణం .. వరుస పరాజయాలు. 'ఇంటిలిజెంట్' .. 'యుద్ధం శరణం' .. 'అంతరిక్షం' సినిమాలు ఆమె అభిమానులకు ఎంతో నిరాశను కలిగించాయి. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాల్లోను ఆమె అందంగానే కనిపించింది. వైవిధ్యభరితమైన పాత్రల్లోనే మెప్పించింది. కానీ పరాజయాలు హీరోయిన్స్ కెరియర్ పై మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తాయనడానికి లావణ్య కూడా మినహాయింపేమి కాదుగదా.

క్రితం ఏడాది చివర్లో మాత్రం లావణ్యకి 'అర్జున్ సురవరం' హిట్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా విజయం ఆమెకి కాస్త ఊరట కలిగించింది. ఆ తరువాత ఆమె  చేసిన 'A1 ఎక్స్ ప్రెస్' విడుదలకి ముస్తాబవుతోంది. సందీప్ కిషన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఇక కార్తికేయ సరసన ఆమె చేసిన 'చావుకబురు చల్లగా' కూడా త్వరలో థియేటర్స్ కి రానుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా, తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఈ రెండు సినిమాలతో ఆమె కెరియర్ పుంజుకోవాలనే కోరుకుందాం! ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త ఏడాదిలో ఆమె వీలైనన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!!
Tags:    

Similar News