ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 'గులాబో సితాబో'కి అంత ప్రాఫిట్ వచ్చిందా...?

Update: 2020-05-19 05:41 GMT
ప్రముఖ బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరో నటుడు ఆయుష్మాన్‌ ఖురానా కలిసి నటించిన చిత్రం 'గులాబో సితాబో'. సుజీత్‌ సర్కార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్‌ ఒక ముస్లిం ఇంటి యజమానిగా.. ఆయుష్మాన్‌ ఖురానా అతని దగ్గర హిందూ కిరాయిదారుగా నటించారు. సరిహద్దులను చెరిపేసే సరదా కథగా తెరకెక్కింది. 'పీకూ' సినిమా తర్వాత అమితాబ్ - సుజీత్‌ సర్కార్‌ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని తొలుత 2020 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత అంతకంటే ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన 'గులాబో సితాబో' విడుదల సాధ్యపడలేదు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ లో జూన్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ మూతబడిపోయి ఉంది. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ తెరుచుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న చిత్రాలను ఇప్పుడు థియేటర్లలోకి విడుదల చేసినా వాటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు రాకపోవచ్చునని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. అందులోనూ తక్కువ బడ్జెట్‌ చిత్రాలైతే డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ మేలనే భావనలో ఉన్నారు. దీంతో ఇప్పటికే షూటింగ్‌కు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు థియేటర్లను కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ వంటి  ఓటీటీ మాధ్యమాలను ఎంచుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో 'గులాబో సితాబో' బాలీవుడ్‌ లో ఈ ఒరవడికి నాంధి పలికిన క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ వారు ఇచ్చిన ఆఫర్ 65 కోట్లు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా శాటిలైట్ వారు సుమారు 15 కోట్లు.. ఆడియో రైట్స్ 7 కోట్లు దాకా బిజినెస్ చేసిందట. అంటే మొత్తం కలుపుకొని 'గులాబో సితాబో'కి దాదాపుగా 88 కోట్లు వరకు వచ్చిందట. ఐతే ఈ సినిమాకి బడ్జెట్ 35 కోట్లు అయ్యింది. అంటే ఈ సినిమా నిర్మాతలకి ఏకంగా 53 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు అయ్యిందన్నమాట.

ఓటీటీలో రిలీజ్ చేసినా ఈ రేంజ్ లో ఒక సినిమా బిజినెస్ చేస్తుంది అనడానికి ఈ 'గులాబో సితాబో'ని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదే రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటే అన్ని క్రేజీ మూవీస్ ఓటీటీ రిలీజ్ కి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ భాషల్లోని 8 సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా మే 29న ఓటీటీలో రాబోతోంది. 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శ‌కుంతల దేవి'.. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ'.. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్' వంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవబోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఓటీటీ రిలీజ్ కి ఓటు వేస్తాయో చూడాలి.
Tags:    

Similar News