షారుఖ్ అడ్డా లోనే జెండా పాతేశాడుగా!
బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే కేవలం షారుఖ్ ఖాన్ సామ్రాజ్యం అనుకునేవారు.;
బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే కేవలం షారుఖ్ ఖాన్ సామ్రాజ్యం అనుకునేవారు. అమెరికా, గల్ఫ్ దేశాల్లో ఆయన పేరు చెబితే చాలు రికార్డులు తిరగరాయాల్సిందే. కానీ ఇప్పుడు ఒక యంగ్ హీరో ఆ పాత లెక్కలన్నింటినీ చెరిపేస్తున్నాడు. ఏకంగా షారుఖ్ గత రికార్డులను సైతం వెనక్కి నెట్టి విదేశీ గడ్డపై తన సత్తా చాటుతున్నాడు. అసలు గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజే కాలేదు, అయినా కూడా వందల కోట్ల వసూళ్లతో ఆ హీరో ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.
అసలు విషయం ఏంటంటే, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధురంధర్ 2’ ఇప్పుడు ఓవర్సీస్ లో ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది. సాధారణంగా గల్ఫ్ మార్కెట్ అనేది బాలీవుడ్ సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్. అలాంటిది మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ సినిమా అస్సలు విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ చిత్రం చైనా వసూళ్లు కాకుండానే ఏకంగా 43.36 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది.
ఇది షారుఖ్ ఖాన్ గత సెన్సేషన్స్ అయిన ‘పఠాన్’ $33.22 మిలియన్, ‘జవాన్’ $28.87 మిలియన్ ల కంటే చాలా చోట్ల బెటర్ వసూళ్లు కావడం గమనార్హం. ఒకవేళ ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో కూడా రిలీజ్ అయ్యుంటే సీన్ మరోలా ఉండేది. కేవలం గల్ఫ్ మార్కెట్ నుంచే సుమారు 10 నుండి 15 మిలియన్ డాలర్లు అదనంగా వచ్చి ఉండేవి. అప్పుడు ‘పఠాన్’ పేరిట ఉన్న ఆల్ టైమ్ ఓవర్సీస్ రికార్డ్ కూడా ఈపాటికే బద్ధలయ్యేది. పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ అంశం కాబట్టి గల్ఫ్ రిలీజ్ వదులుకున్నారనేది తెలిసిన విషయమే.
ఆ విషయం పక్కన పెడితే, కేవలం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లతోనే రణ్‌వీర్ ఈ రేంజ్ లో దుమ్మురేపడం విశేషం. ‘ఉరి’ లాంటి సినిమాతో సత్తా చాటిన దర్శకుడు ఆదిత్య ధర్ మేకింగ్ కు విదేశీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం బాక్సాఫీస్ ట్రెండ్ మారుతోంది. కేవలం స్టార్ పవర్ చూసి కాకుండా, కంటెంట్ లో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. స్పై థ్రిల్లర్ కావడం, రణ్‌వీర్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమాకు ఆర్గానిక్ గానే పెద్ద ఎత్తున వసూళ్లు వచ్చాయి.
ఇప్పటివరకు ఓవర్సీస్ అంటే కేవలం ఖాన్లదే అనుకున్న వారికి ఈ సినిమా ఒక కొత్త సంకేతాన్ని పంపింది. సరైన కథ ఉంటే ఏ హీరో అయినా విదేశీ మార్కెట్ లో రికార్డులు సృష్టించవచ్చని ‘ధురంధర్ 2’ ప్రూవ్ చేసింది. బడ్జెట్లు పెరుగుతున్న ఈ రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ పై పట్టు సాధించడం ప్రతి స్టార్ హీరోకు ఇప్పుడు తప్పనిసరి. మరి రణ్‌వీర్ ఈ స్పీడ్ ను తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో కూడా కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.