డిజిటిల్ స్ట్రీమింగ్స్‌ లో సినిమా విడుదలకు వెళ్తున్న ఫస్ట్ టాలీవుడ్ హీరో

Update: 2020-04-14 10:10 GMT
డిజిటల్ ప్రపంచంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రచ్చ మొదలయ్యాక థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందరూ ఈ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆలోచించేవారు, ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందోనన్న ఆరాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటికి సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటూ, షేర్ చేసుకుంటూ సినిమాలను చూస్తున్నారు నేటి కాలం ప్రేక్షకులు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడకపోవడంతో మరో రెండు వారాలు పొడిగించారు. పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. జనాలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. వాళ్లకు సినీ వినోదం కావాలి. టీవీల్లో వచ్చేవన్నీ పాత సినిమాలే. పైగా అక్కడ ప్రసారమైన నిర్దేశిత సమయంలోనే ఆయా సినిమాలు చూడాలి. ఇలాంటి తరుణంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు మామూలు గిరాకీ లేదు. జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విరగబడి సినిమాలు చూసేస్తున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌ లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ నటించిన ఓ సినిమా మొదటగా డిజిటల్ స్ట్రీమింగ్స్‌ లో విడుదలకాబోతోందని సమాచారం.

సందీప్ కిషన్ - అరవింద్ స్వామి - శ్రియ శరణ్ - ఆథ్మిక - ఇంద్రజిత్ సుకుమారన్ నటించిన తమిళ థ్రిల్లర్ 'నరగసూరన్'. తమిళ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయనే ఈ సినిమాకు నిర్మాత కూడా. 2017లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా కేవలం 41 రోజుల్లో పూర్తయింది, కానీ వివిధ కారణాల వల్ల విడుదల కాలేదు. ఈ మూవీని ఇటీవల మార్చి 27 న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు ఇతర కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీనితో ఇక థియేటర్లలో విడుదల చెయ్యడం సాధ్యం కాదని అనుకున్న నిర్మాతలు దీనిని ప్రత్యక్ష డిజిటల్ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ చిత్రం ఏప్రిల్ 17 నుండి నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ప్రత్యక్ష డిజిటల్ విడుదల చేసిన తొలి తెలుగు హీరోగా సందీప్ కిషన్ నిలవబోతున్నారు. సందీప్ కిషన్ ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాడు కానీ అక్కడ ఈ హీరోకు సరైన బ్రేక్ దక్కలేదు. ఈ సినిమా వల్ల అది జరిగే అవకాశాలు లేకపోయినా సినిమా బావుండి సందీప్ కిషన్ కి మంచి పేరైనా వస్తుందేమో చూడాలి. సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగులో 'ఏ1 ఎక్స్ ప్రెస్' అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News