లెజెండరీ యాక్టర్ పేరు ఓటర్ లిస్టులో తీసేశారు

Update: 2016-04-30 09:41 GMT
ఎన్నికలు వస్తున్నాయంటే.. ఓటర్ల లిస్టులో అవకతవకల గురించి ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా అనిపించే వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితాలోంచి తీసి పారేయడం మామూలు విషయమే. ఇది ప్రతి రాష్ట్రంలోనూ జరిగే తంతే. ఐతే సామాన్యుల ఓట్లు గల్లంతయితే ఏమో అనుకోవచ్చు కానీ.. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి పేరు కూడా ఓటర్ లిస్టు నుంచి తీసి పారేశారు అక్కడి అధికారులు. తన కొత్త సినిమా ‘శభాష్ నాయుడు’ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు లోక నాయకుడు.

ఈ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ మే 16న జరగబోయే ఎన్నికల్లో తాను ఓటు వేయడం లేదని అన్నాడు. ‘విశ్వరూపం’ విడుదల సందర్భంగా జయలలితతో జరిగిన కయ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మాట అంటున్నాడేమో అనుకున్నారంతా. కానీ తన పేరు ఓటర్ లిస్టులో ఉంటే కదా ఓటు వేయడానికి అని అసలు విషయం వెల్లడించాడు కమల్. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తనకు మంచి ఫ్రెండే అయినప్పటికీ ఈ విషయంలో తాను చేయడానికేమీ లేకపోయిందని.. తనకు ఓటు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు కమల్. అంతటితో ఆగకుండా గత ఎన్నికల్లో కూడా తాను ఓటు వేయని విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కమల్. తాను పోలింగ్ స్టేషన్ కు వెళ్లేసరికే మరో వ్యక్తి తన పేరుతో ఓటు వేసేయడంతో చేసేది లేక వెనక్కి వచ్చేశానని కమల్ చెప్పడం విశేషం. కమల్ లాంటి ప్రముఖుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది?
Tags:    

Similar News