ఇందూకి జ‌వానీ పాఠం టాలీవుడ్ కి వ‌ర్తిస్తుందా?

Update: 2020-12-15 04:12 GMT
మ‌హ‌మ్మారీ భ‌యాలు తొల‌గిపోక ముందే థియేట్రిక‌ల్ రిలీజ్ అంటే జ‌నం సినిమా హాళ్ల‌కు వ‌స్తారా? ఇప్ప‌టికీ ఈ ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం లేదు. ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇచ్చేశాయ‌ని త‌మ సినిమాల్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తే జ‌నం రాక‌పోతే ప‌రిస్థితేమిటి? అలాంటి బోల్డ్ డెసిష‌న్ తీసుకుంటే నిర్మాత‌లు డిస్ట్రిబ్యూట‌ర్ల స‌న్నివేశం ఎలా ఉంటుంది? ఇలాంటి ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌ల న‌డుమ ఆ హిందీ నిర్మాత తీసుకున్న బోల్డ్ స్టెప్ కి పెద్ద మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది.

మహమ్మారి కారణంగా బాక్సాఫీస్ వద్ద విఫలమవుతుందనే భయంతో `లక్ష్మీ బాంబ్` వంటి భారీ క్రేజీ సినిమాని సైతం థియేట్రికల్ విడుదలను దాటవేసి డిజిట‌ల్లో రిలీజ్ చేశారు. కానీ `ఇందూ కి జవానీ` నిర్మాతలు థియేటర్లలో విడుదల చేసి బోల్డ్ స్టెప్ తీసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. నిర్మాత‌లు ధైర్యంగా అడుగులు వేసినందుకు మూల్యం చెల్లించింది.

ఇందూ కి జవానీ భారతదేశం అంతటా అలాగే విదేశీ మార్కెట్లలో డిజాస్ట‌ర‌స్ వీకెండ్ రిజ‌ల్ట్ ని చూపించింది. ఈ చిత్రం భారతదేశంలో రూ.1కోటి నెట్ కలెక్షన్లను కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిల‌బ‌డింది. విదేశాల్లో మ‌రీ దారుణ స‌న్నివేశం ఎదురైంది.

హాలీవుడ్ యాక్షన్ చిత్రం టెనెట్ గత వారాంతంలో మ‌ల్టీప్లెక్సుల్లో రిలీజై చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింది. రెండవ వారాంతం ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్లు ద‌క్కాయి. ఇలాంటి భారీ క్రేజీ సినిమాల కోసం మాత్ర‌మే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. అయితే భారీ క్రేజు ఉన్న సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. కోవిడ్ ఆంక్షల న‌డుమ‌ పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు. మ‌ల్టీప్లెక్సుల వ‌ర‌కూ ఓకే కానీ.. సింగిల్ థియేటర్లలో చాలా వరకు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి. తెరిచినా కానీ న‌ష్టాల పాల‌వుతున్నారు. దీనివ‌ల్ల ఇంకా సందిగ్ధ‌త అలానే ఉంది. తాజా స‌న్నివేశం చూస్తుంటే ఇందూకి జ‌వానీ రిజ‌ల్ట్ చూశాక టాలీవుడ్ సినీవ‌ర్గాల్లో ఎలాంటి నిర్ణ‌యాలు ఉంటాయో వేచి చూడాల్సి ఉంటుంది.

ఈ క్రిస్మ‌స్ కానుక‌గా సాయి తేజ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`ని బెట‌ర్ ప్లాన్ తో రిలీజ్ చేస్తారేమో చూడాలి. జ‌నాల నుంచి భ‌యాందోళ‌న‌లు తొల‌గించేందుకు మ‌న హీరోలు ఇప్ప‌టికే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నం ఫలించి జ‌నం ఇండ్ల నుంచి బ‌య‌ట‌ప‌డి థియేట‌ర్ల‌కు వ‌స్తారేమో చూడాలి. క్రిస్మ‌స్ క్లిక్క‌యితే సంక్రాంతికి వ‌రుస‌గా సినిమాలు రిలీజ‌య్యే ఛాన్సుంటుందే‌మో!
Tags:    

Similar News