వంశీ పైడిపల్లి.. అంత పెద్ద సినిమా తర్వాత

Update: 2020-12-07 13:30 GMT
టాలీవుడ్ హై ప్రొఫైల్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకడు. అతను మొదట్నుంచి పెద్ద స్టార్లతోనే సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌తో చేసిన తొలి సినిమా ‘మున్నా’ ఫ్లాప్ అయినా సరే.. అతడి రేంజ్ తగ్గలేదు. వరుసగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున, మహేష్ బాబులతో అతను సినిమాలు చేశాడు. చివరగా చేసిన ‘మహర్షి’ ఎంత పెద్ద సినిమానో తెలిసిందే. మహేష్ లాంటి సూపర్ స్టార్‌ హీరోగా.. మూడు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రమిది. సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసి, అదే స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టింది ‘మహర్షి’. ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్‌తోనే ఓ చిత్రం చేయాలని ఆశపడ్డాడు వంశీ. అతను కూడా ఆసక్తితోనే ఉన్నాడు. కానీ వంశీ తయారు చేసిన స్క్రిప్టు నచ్చలేదు. దీన్ని పక్కన పెట్టి వేరే సినిమాకు వెళ్లిపోయాడు మహేష్.

మహేష్ నో చెప్పి పది నెలలు కావస్తోంది. కానీ ఇంత వరకు తన తర్వాతి సినిమా ఏదో తేల్చుకోలేకపోయాడు వంశీ. టాలీవుడ్ బడా స్టార్లెవ్వరూ అతడితో సినిమా చేసే స్థితిలో లేరు. అందరికీ కమిట్మెంట్లు ఉన్నాయి. అలాగే వంశీతో చేయడానికి ఆసక్తి కూడా పెద్దగా లేకపోవచ్చు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడతను. ఈ పరిస్థితుల్లో ఒక చిన్న వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యాడు వంశీ. అల్లు వారి ఆహా ఓటీటీ కోసం అతనీ సిరీస్ చేయబోతున్నాడు. టాలీవుడ్లో ప్రవీణ్ సత్తారు లాంటి వేరే డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. బాలీవుడ్లో పెద్ద పెద్ద దర్శకులే ఈ సిరీస్‌ లు చేస్తుంటారు. కానీ వాళ్లందరూ ఆసక్తి తో, ఇష్ట పూర్వకంగా, సినిమాల మధ్య కొంచెం ఖాళీ చేసుకుని అవి చేస్తున్నారు. కానీ టాలీవుడ్లో వంశీ స్థాయి దర్శకులెవరూ వెబ్ సిరీస్‌ల వైపు చూడట్లేదు. పైగా అతను సినిమా ఏదీ ఓకే అవక ఇది చేయాల్సి రావడం ఇబ్బందికరమే.
Tags:    

Similar News