కిరీటం అలంకారం కాదు ఓ బాధ్యత!
భువనేశ్వర్ లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీ ఫెమినా మిస్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే పోటీలో గోవాకు చెందిన 24 ఏళ్ల సాధ్యీ శైల్ విజేతగా నిలిచి మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకుంది.;
భువనేశ్వర్ లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీ ఫెమినా మిస్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే పోటీలో గోవాకు చెందిన 24 ఏళ్ల సాధ్యీ శైల్ విజేతగా నిలిచి మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం ఆమెకు 2027లో టాంజానియాలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని తెచ్చిపెట్టింది. విజయానంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కిరీటాన్ని తాను కేవలం అలంకారంగా భావించడం లేదని ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నానని పేర్కొంది. సాధ్యీ శైల్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా నుండి ఎకనామిక్స్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డబుల్ మేజర్ పూర్తి చేసింది.
చదువు కోసం విదేశాలకు వెళ్లినప్పుడు ఎదురైన సవాళ్లు ఆమెను మానసికంగా ఎంతో దృఢపరిచాయి. సాధారణ మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన సాధ్యీ ఒకప్పుడు ఇతరుల విజయాలను చూసి తనను తాను తక్కువగా అంచనా వేసుకునేదట. కానీ ఆత్మవిశ్వాసంతో ఆలోచనా దృక్పథాన్ని మార్చుకుని నేడు ఈ స్థాయికి చేరుకుంది.
ఈ అందాల పోటీలో సాధ్యీని విజేతగా నిలబెట్టిన ప్రధాన అంశం ఆమె ఇచ్చిన సమాధానం. `క్షణికమైన కీర్తి కంటే సామాజిక ప్రభావం చూపడం మిన్న అని ఆమె ఎంతో పరిణతితో సమాధానమిచ్చింది. అందం మాత్రమే కాకుండా తెలివితేటలు, సమాజం పట్ల ఉన్న నిబద్ధత విజేతకు ఉండాల్సిన లక్షణాలని ఆమె నిరూపించింది.
నటన , మోడలింగ్ రంగాల్లోనే కాకుండా నిర్మాణ రంగంలో కూడా కంపెనీకి కో-ఫౌండర్‌గా ఉంటూ వ్యాపార దక్షతను చాటుకుంటోంది. సాధ్యీ శైల్ వ్యక్తిత్వంలో మరో విశేషం ఏంటంటే? ఆసక్తికరమైన హాబీలు. ఆమె ఒక సర్టిఫైడ్ బీకీపర్. అంటే తేనెటీగల పెంపకందారి, ఫొటోగ్రాఫర్ , కుమ్మరి పని లో కూడా ప్రవేశం ఉంది. ఏడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఆమె సొంతం. అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరపున గళం విప్పడానికి ఈ నైపుణ్యాలు ఆమెకు ఎంతో సహాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తన స్ఫూర్తిప్రదాతగా ఐఎంఎఫ్ గీతా గోపీనాథ్‌ను పేర్కొనడం విశేషం.
ప్రస్తుత అందాల పోటీల ట్రెండ్‌పై స్పందిస్తూ `ఈ వేదికలు ఇప్పుడు బాహ్య సౌందర్యానికే పరిమితం కావడం లేదని సాధ్యీ అభిప్రాయపడింది. ప్రతిభకు, వ్యక్తిత్వానికి , సొంత ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు న్నారని పేర్కొంది. గ్లామర్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనుషులు మారిపోతుంటారని తాను విన్నానని, కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తన లక్ష్యమని ధీమాగా చెబుతోంది. తన మూలాలను మర్చిపోకుండా ఉండటమే అసలైన విజయమని చెబుతుంది. సాధ్యీ శైల్ విజయం ఎంతో మంది యువతులకు కొత్త దిశను చూపిస్తోంది. స్వయంకృషితో, చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటే ఏ శిఖరాన్నైనా అధిరోహించొచ్చని నిరూ పించింది. 2027 మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆశిద్దాం.