దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్ కోసం ప్రయత్నాలు..?

Update: 2021-08-11 00:30 GMT
టాలీవుడ్ లో దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ ఎన్నో ఏళ్లుగా వార్తల్లో ఉంది. వెంకీ - రానా మరియు వెంకీ - నాగచైతన్య కాంబినేషన్ లో సినిమాలు చేయాలని డి. రామానాయుడు ఆశపడ్డారు కానీ.. కథ కుదరలేదు. అయినప్పటికీ మల్టీస్టారర్ కోసం ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉందని.. సరైన స్క్రిప్ట్ కుదిరిన వెంటనే సినిమా మొదలు పెడతామని వెంకీ - రానా - సురేష్ బాబు ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

అయితే ఇప్పుడు బాబాయ్ - అబ్బాయ్ లకు మల్టీస్టారర్ కథ దొరికిందని.. కాకపోతే అది వెబ్ సిరీస్ అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ - రానా లతో ఓ సిరీస్ చేయడానికి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ మంతనాలు జరుపుతోందట. ఇప్పటికే కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్న సురేష్ బాబు.. దగ్గుబాటి హీరోలతో ఓ వెబ్ సిరీస్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ నుంచి వెబ్ సిరీస్ లో అడుగుపెట్టే స్టార్ హీరోలు వెంకటేష్ - రానా అవుతారు. ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లు మినహా ఇంతవరకు ఏ హీరో కూడా వెబ్ కంటెంట్ లో నటించే సాహసం చేయలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం దగ్గుబాటి హీరోలు దిగుతే మాత్రం ఇదొక క్రేజీ వెబ్ సిరీస్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ వారు.. పెద్ద సినిమాలను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలు పెట్టారు.

వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' రీమేక్ గా తెరకెక్కిన ''నారప్ప'' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు. ఇదే క్రమంలో వెంకీ నటించిన మరో రీమేక్ ''దృశ్యం 2'' చిత్రాన్ని హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక రానా నటించిన 'విరాటపర్వం' సినిమాని ఏ వేదికపై విడుదల చేస్తారనే విషయంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News