చిక్కుల్లో ధనుష్‌ సినిమా

Update: 2015-06-27 11:30 GMT
కాకాముట్టై.. మూడు వారాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది ఈ సినిమా. మురికివాడలో పెరిగే ఇద్దరు పిల్లలు మూడొందల రూపాయల ఖరీదైన పిజ్జా తినడం కోసం ఏం చేశారన్న కథతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మణికందన్‌. దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తారు. హైదరాబాద్‌ సహా చాలా నగరాల్లో సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 'ఆడుగళం' సినిమాకు దర్శకత్వం వహించిన వెట్రిమారన్‌తో కలిసి ధనుష్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం.

ఇలాంటి సినిమా నిర్మించినందుకు ధనుష్‌, వెట్రిమారన్‌ మొన్నటిదాకా ప్రశంసలే అందుకున్నారు కానీ.. ఇప్పుడు వాళ్లిద్దరికీ నోటీసులు కూడా అందాయి. ఈ సినిమాలో న్యాయవాద వృత్తిని కించపరిచేలా సన్నివేశాలు తీశారంటూ కొన్ని రోజుల కిందట చెన్నైకి చెందిన న్యాయవాదుల బృందం కోర్టుకెక్కింది. వాళ్ల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. వారి వాదనలు విన్న తర్వాత ధనుష్‌, వెట్రిమారన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మధ్య మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సినిమా నిర్మాతల మీద కోర్టుకెక్కడం మామూలైపోతోంది. ఐతే చాలా సందర్భాల్లో ఇలాంటివి సినిమా పబ్లిసిటీకే ఉపయోగపడుతున్నాయి తప్పితే.. అంతకుమించి ఏమీ జరగట్లేదు. 'కాకా ముట్టై' విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News