తమిళనాడులో రష్యాను రీ క్రియేట్‌ చేస్తున్నారు

Update: 2020-05-13 10:10 GMT
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. షూటింగ్స్‌ గత రెండు నెలలుగా జరగడం లేదు. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లడమే కష్టంగా ఉంది. ఇక అక్కడ షూటింగ్స్‌ అంటే అసాధ్యం. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు విదేశీ షూటింగ్స్‌ ఆగిపోయినట్లే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. చాలా ఇండియన్‌ సినిమాలను ఇండియాలోనే పూర్తి చేసేందుకు స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు రీ షెడ్యూల్‌ చేస్తున్నారు.

విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ‘కోబ్రా’ చిత్రంను ఎక్కువ శాతం రష్యాలో చిత్రీకరించేందుకు షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. కాని ప్రస్తుతం రష్యాలో ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. రాబోయే ఆరు నెలల వరకు రష్యాలో కాలు మోపాలన్నా కూడా సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. అందుకే కోబ్రా చిత్రంను పూర్తిగా తమిళనాడు పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించాలనే నిర్ణయానికి దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు వచ్చాడు.

రష్యాకు సంబంధించిన సీన్స్‌ కోసం తమిళనాడులో ప్రత్యేకంగా భారీ బడ్జెట్‌ తో సెట్స్‌ ను నిర్మించాలని ఆయన భావిస్తున్నాడు. రష్యాలోని పలు లొకేషన్స్‌ ను ఆయన రీ క్రియేట్‌ చేయడం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాడు. ఆర్ట్‌ డైరెక్టర్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులతో చర్చిస్తున్నాడు. అన్ని కాకున్నా సాధ్యం అయినంత వరకు అయినా కూడా రష్యాకు చెందిన లొకేషన్స్‌ ను ఇక్కడ రీ క్రియేట్‌ చేయడం జరుగుతుందని కోబ్రా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని మేకర్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి రహమాన్‌ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీనిధి శెట్టి మరియు మియా హీరోయిన్స్‌ నటిస్తున్నారు. 50 శాతంకు పైగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది.
Tags:    

Similar News