థియేటర్స్ రీ ఓపెనింగ్‌ పై సినిమాటోగ్రఫీ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్...!

Update: 2020-05-16 08:50 GMT
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై కూడా బాగానే పడింది. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. సినిమా షూటింగులు ఆగిపోయాయి. గత రెండు నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి లేక జీవనం సాగించడం కష్టంగా మారింది. కొన్ని సినిమాలు థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ చేసే అవకాశం లేదని భావించి ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య ప్రభుత్వం అత్యవసర రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తున్నా.. వినోద రంగం లాంటి వాటికి మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కానీ సాధారణ పరిస్థితులు వస్తే థియేటర్స్ ఓపెన్ అవుతాయని.. షూటింగ్స్ మళ్లీ మొదలుపెట్టుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ అందర్నీ షాక్‌కు గురి చేసింది.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్ గతంలో జరిగిన సమీక్షలో జూన్ లో షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆశలు చిగురించాయి. కానీ తాజాగా వారి ఆశలపై నీళ్లు జల్లారు తలసాని. ''ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుంది. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని నేను అనుకోవటం లేదు. భౌతిక దూరం ఉండేలా థియేటర్ల సీటింగ్ మార్చాల్సి ఉంది. ఈ నిబంధనకు మల్టిప్లెక్స్‌ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా.. సింగిల్‌ స్క్రీన్స్‌ తో పాటు పట్టణాలు గ్రామాల్లోని థియేటర్లు ఆర్ధిక భారాన్ని మోయలేవు. ఎగ్జిబిటర్‌ లు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే కనీసం మరో 3 లేదా 4 నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం మాకు లేదు'' అని మంత్రి తలసాని వెల్లడించారు. అంతేకాకుండా లుంబినీ పార్క్ గోకుల్ చాట్ ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజలంతా భయపడ్డారని.. కానీ ఇప్పుడు ఆ ప్రదేశాలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలాగే ఇది కూడా సాధారణ పరిస్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని.. షూటింగ్‌ ల విషయంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మరి ఈ పరిణామాలపై నిర్మాతలు.. సినీ పెద్దలు.. థియేటర్ల యాజమాన్యాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News