మన లెజెండ్ గురించి వాళ్లు పొగుడుతుంటే..

Update: 2017-04-25 06:46 GMT
మన వాళ్ల గురించి మనం ఎంత పొగుడుకున్నా ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. అది వేరేవాళ్ల మన వాళ్ల ప్రతిభను గుర్తించి.. వాళ్ల గొప్పదనం గురించి గొప్పగా మాట్లాడినపుడు ఉండే కిక్కే వేరుగా ఉంటుంది. కళాతపస్వి విశ్వనాథ్ కు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఆయన గురించి తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్పందించిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మామూలుగా తమిళులు వేరొకరి గురించి పొగడ్డానికి ఇష్టపడరు. తామే గొప్ప అన్న ఫీలింగ్‌ తో కనిపిస్తారు. ఐతే విశ్వనాథ్ తమ వాడు కాకపోయినా.. ఒక్క తమిళ సినిమా కూడా తీయకపోయినా.. ఆయనపై కోలీవుడ్ జనాలు ప్రశంసలు కురిపించిన తీరు ఆశ్చర్యం కలిగించేదే.

ముఖ్యంగా కమల్ హాసన్ విశ్వనాథ్ గురించి కామెంట్ చేసిన తీరు అద్భుతం. ‘‘నా విశ్వనాథ్ గారు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత. ఆయన ఇప్పుడు ఎంతో అణకువతో నేను అదృష్టవంతుడిని అంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన లాంటి దర్శకుడిని కలిగి ఉన్నందుకు భారతీయులు అదృష్టవంతులు. నేను కూడా’’ అని కమల్ అన్నాడు. సాగరసంగమం లాంటి సినిమాను తనకు ఇచ్చినందుకు మెరిసే తడి కళ్లతో విశ్వనాథ్‌ కు ధన్యవాదాలు చెబుతున్నానని.. ఆయన పేరు తనదని.. తన పేరు ఆయనదని కమల్ అన్నాడు. మరోవైపు కోలీవుడ్ విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘విశ్వనాథ్ గారికి పురస్కారం దక్కిందని తెలియగానే చాలా సంతోషం కలిగింది. నాలాంటి ఎందరో ఫిలిం మేకర్స్ కు ఆయన ఆదర్శం. ఆయనతో కలిసి పని చేసే అవకాశం దక్కినందుకు అదృష్టవంతుడిని. ఆయన ఓ వజ్రం లాంటి మనిషి. ఆయనతో నా సంభాషణల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. సాగరసంగమం సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఆయన గొప్ప దర్శకుడు.. గొప్ప నటుడు. వెండి తెర మీద అద్భుతాలు ఆవిష్కరించారు’’ అని సెల్వ రాఘవన్ పేర్కొన్నాడు. మరోవైపు హీరో ధనుష్ స్పందిస్తూ.. ‘‘లెజెండరీ ఫిలిం మేకర్.. యాక్టర్.. సౌండ్ డిజైనర్ విశ్వనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశాడు. ఇంకా కోలీవుడ్ కు చెందిన ఎందరో విశ్వనాథ్ కు శుభాకాంక్షలు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News