టాలీవుడ్ నిర్మాతలకు బయ్యర్ల భారీ దెబ్బ.. అడ్వాన్సుల రిటర్న్!

Update: 2020-06-25 11:34 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీలలో సినిమాల పరిస్థితులు.. వాటి లెక్కలు మొత్తం మారిపోయాయి. కరోనా దెబ్బకు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా మసకబారిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో యజమానులు తీవ్ర నష్టాలలో మునిగిపోయారు. నిజానికి వేసవి సీజన్‌లో వచ్చే లాభాలతోనే ఏడాదంతా థియేటర్లు నడపగలుగుతున్నామని, ఈ సమయంలోనే సమస్య తలెత్తడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని థియేటర్ల ఓనర్లు అంటున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసినా కొంతమంది థియేటర్లను తెరిచే అవకాశం కనిపించడం లేదంటున్నారు.

లాక్ డౌన్ ముందు ప‌రిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా సినిమాలు విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు సిద్ధంగా లేరట. అన్నిటికంటే ముందు బయ్యర్లు సిద్ధంగా లేరట. ఇప్పటికే కొన్న సినిమాలు విడుదలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని.. మా అడ్వాన్సులు మాకు తిరిగి ఇచ్చేయాలని   డిమాండ్ చేస్తున్నారట. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు సినిమాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయట. అవే రామ్ 'రెడ్‌'.. రవితేజ క్రాక్‌, సాయిధరమ్ తేజ్ 'సోలో బ్ర‌తుకే సో బెటర్'. ఈ మూడు సినిమాల‌కు సంబంధించిన థియేట్రికల్ హక్కులన్నీ ముందే అమ్ముడు పోయాయి. బ‌య్య‌ర్లు అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు.

అయితే క్రాక్ సినిమాను అన్నీ ఏరియాలలో కలిపి 20కోట్లకు.. అలాగే సోలో బ్ర‌తుకే సో బెట‌రు 16కోట్లకు అమ్ముడవగా.. రెడ్ సినిమాకి కూడా మంచి ధరకే అమ్ముడైందట. ప్రస్తుతం ఈ సినిమాలను బ‌య్య‌ర్లు వ‌దులుకోవ‌డానికి ముందుకొస్తున్నారట. మాకొద్దని నిర్మాతలతో కూడా చెప్పేసారట. కావాలంటే క‌మీష‌న్ ప‌ద్ధ‌తిలో మీ సినిమాల్ని విడుద‌ల చేస్తాం కానీ.. కొన‌లేం అంటున్నట్లు సమాచారం. ప్రస్తుత సమయంలో థియేటర్లు ఓపెన్ కావని.. తెర‌చుకున్నా జనం రారనే భ‌యాలు నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలే కాదు. ఇది వ‌ర‌కే బిజినెస్ పూర్త‌యిన మ‌రిన్ని సినిమాల‌కూ ఇదే స‌మ‌స్య.. అయితే వీటన్నిటి బాధ్యత నిర్మాతే భరించాల్సి వస్తుందట.
Tags:    

Similar News