ఆ యాక్సిడెంట్ వల్ల బ్రహ్మి ఖాళీ..

Update: 2016-07-27 13:30 GMT
హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన కమెడియన్ బ్రహ్మానందం. రెండేళ్ల కిందటి వరకు ఆయన ఎంత బిజీగా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే వరుసగా బ్రహ్మి నటించిన పెద్ద సినిమాలన్నీ తేడా కొట్టేయడం మొదలుపెట్టడంతో ఆయన పనైపోయిందంటూ ప్రచారం మొదలైంది. చివరికి ఆ ప్రచారమే నిజమై.. బ్రహ్మి పనైపోయే పరిస్థితి వచ్చేసింది. వరుసగా పెద్ద సినిమాల్లో ఆయనకు చోటు లేకుండా పోయింది. త్రివిక్రమ్.. శ్రీను వైట్ల లాంటి బ్రహ్మి లేకుండా సినిమాలు చేయని దర్శకులు కూడా ఆయన్ని పక్కనబెట్టేసే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం బ్రహ్మి ఏ పెద్ద సినిమాలోనూ నటిస్తున్నట్లయితే సంకేతాలు రావట్లేదు.

తెలుగు దర్శక నిర్మాతలు బ్రహ్మి మీద శీతకన్నేసిన టైంలో కమల్ హాసన్ ఆయనకు ఓ మంచి అవకాశం ఇచ్చారు. ‘శభాష్ నాయుడు’ సినిమాలో బ్రహ్మి కోసం కీలక పాత్ర రాయించారు. హీరోతో సమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర ఇది. ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడు బ్రహ్మి. కమల్ తో కలిసి ఫస్ట్ షెడ్యూల్ కోసం అమెరికాకు కూడా వెళ్లాడు. షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. కానీ ఇంతలో కమల్ గాయపడ్డాడు. ఇప్పటికే రెండు వారాలుగా షూటింగుకి దూరమయ్యాడు. ఇంకో నెల రోజులు ఆయన సెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో బ్రహ్మి డేట్లు వృథా అయ్యాయి. ఉన్నట్లుండి ఖాళీ అయిపోయాడు బ్రహ్మి. ఈ ఖాళీని పూరించడానికి వేరే సినిమాలు కూడా పెద్దగా లేనట్లున్నాయి. కన్నడలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ కోసం ఓ వారం పని చేస్తున్నాడు బ్రహ్మి. ఆ తర్వాత కమల్ ఎప్పుడు కోలుకుంటాడా అని ఎదురు చూడ్డమే.
Tags:    

Similar News