ఎన్టీఆర్ కు భార‌తర‌త్న ఇవ్వాలిః మెగాస్టార్‌

Update: 2021-05-28 04:50 GMT
న‌ట‌సార్వ‌భౌమ‌ నంద‌మూరి తార‌క‌రామావుకు భార‌తర‌త్న ఇవ్వాల‌ని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు చిరు. నేడు (మే 28) ఎన్టీఆర్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట‌ర్ వేదిక‌గా పోస్టు చేశారు. ‘‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్నఇచ్చినట్టు.. మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌర‌వం ద‌క్కితే అది తెలుగు వారికి ద‌క్కే గౌర‌వం. ఆ మ‌హానుభావుడి 98వ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా వారిని స్మ‌రించుకుంటూ’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమకు, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలకుగానూ.. భారత రత్నతో సత్కరించాలని పలువురు ప్రముఖులు కొంతకాలంగా కోరుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్టీఆర్ శతజయంతి రాబోతున్న నేపథ్యంలో.. ఈ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News