నా వాయిస్ కి ఎలాంటి ఢోకాలేదు: బప్పీలహరి

Update: 2021-09-22 23:30 GMT
సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా బప్పీలహరికి విపరీతమైన క్రేజ్ ఉంది. తన లుక్ తో పాటు తాను అందించే సంగీతం కూడా డిఫరెంట్ గా ఉండాలని ఆయన భావిస్తుంటారు. ఆయన అడుగుపెట్టడానికి ముందు బాలీవుడ్లో పాటలు సెలయేటి గలగలల మాదిరిగా సాగిపోతూ వచ్చాయి. బప్పీలహరి ఒక్కసారిగా పాటలకు పరుగులు నేర్పారు. ఉత్సాహంతో ఉరుకులు పెట్టించారు. కొత్త వాద్య పరికరాలను ఉపయోగిస్తూ, కొత్త ప్రయోగాలు చేశారు. ఆయన పాటలు యువతకు కుదురులేకుండా చేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కొత్తదనాన్ని కోరుకునే హీరోలంతా తమ సినిమాలకి ఆయనే పనిచేయాలనే కండిషన్ పెట్టే స్థాయిలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. గాయకుడిగా ఆయనది ప్రత్యేకమైన వాయిస్ .. సింగర్ గాను ఆయన పాటలకు కొత్త సంగతులు నేర్పారు. నిదానంగా .. నింపాదిగా ఉండటం, తాపీగా సాగడం ఆయన వాయిస్ కీ గానీ .. బాణీలకు గాని తెలియదు. ఆయన పాటలు వినేవారికి ఎప్పటికీ ఎనర్జీ డ్రింక్స్ అవసరమే ఉండదు. అలా జోరుగా .. హుషారుగా ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా రావడం వలన ఆయన వాయిస్ పూర్తిగా దెబ్బతిందనీ .. ఇక ఆయన పాడటం కష్టమేననే ప్రచారం ఊపందుకుంది.

దాంతో ఆయన తాను బాగానే ఉన్నాననీ .. తన వాయిస్ కి ఎలాంటి ఢోకా లేదని చెప్పడం కోసం ఒక పాటను పాడి ఆ వీడియోను వదిలారు. ఈ పుకారుకు ఇంతకు మించిన విరుగుడు లేదన్నట్టుగా ఆయన వ్యవహరించారు. ఇక తెలుగులో బప్పీలహరి సంగీతాన్ని అందించిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలవడం విశేషం. ఆ జాబితాలో సింహాసనం .. గ్యాంగ్ లీడర్ .. రౌడీ అల్లుడు .. రౌడీగారి పెళ్ళాం .. రౌడీ ఇన్ స్పెక్టర్ .. బ్రహ్మ కనిపిస్తాయి. ఈ మధ్య రవితేజ హీరోగా వచ్చిన 'డిస్కోరాజా' సినిమాలోను ఆయన ఒక పాట పాడటం విశేషం.


Tags:    

Similar News