రాజకీయాలే కాదు సినిమాలు కూడా చేస్తా..!

Update: 2018-12-11 07:09 GMT
కాంగ్రెస్‌ పార్టీలో చేరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న బండ్ల గణేష్‌ కు ఆ పార్టీ షాక్‌ ఇచ్చింది. అయినా కూడా పార్టీ కోసం తనవంతుగా ప్రచారం చేశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీ ఆర్‌ ఎస్‌ నాయకులపై బండ్ల బాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తనకు పెద్ద పదవి ఏదైనా వస్తుందని ఆశించాడు. కాని పరిస్థితి తారు మారు అయ్యింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్‌ ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు చేస్తూనే మళ్లీ సినిమాు నిర్మించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.

బండ్ల గణేష్‌ మాట్లాడుతూ... ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. కాని ప్రజా సేవే జీవితంగా పెట్టుకోను. ప్రజా సేవే చేసుకుంటూ ఉంటే నా కుటుంబం పరిస్థితి ఏమవుతుంది. అందుకే సినిమాలు కూడా నిర్మించాలని భావిస్తున్నాను. ఇప్పటికే కొన్ని కథలు కూడా సిద్దం చేయిస్తున్నాను. తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై క్లారిటీ వచ్చిన తర్వాత తాను సినిమాలను ప్రకటిస్తాను. చిన్న సినిమాలు చేయను అని, పెద్ద స్టార్స్‌ తోనే సినిమాలు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా బండ్ల గణేష్‌ చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో మరోసారి టీఆర్‌ ఎస్‌ నాయకులపై బండ్ల గణేష్‌ విమర్శలు చేశాడు. తాను సినిమాలు చేయకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను అన్నాడు. వారిలా నేను కమీషన్‌ లు కొట్టలేదు - వారికి క‘మీషన్‌’ భగీరథ - క‘మీషన్‌’ కాకతీయ ఉన్నాయి, కాని నాకు అలాంటివి ఏమీ లేవు. అందుకే సినిమాలు నిర్మించాలని నిర్ణయానికి వచ్చాను. ఇద్దరు స్టార్‌ హీరోలు కూడా తనకు డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారని బండ్ల గణేష్‌ అన్నాడు. సినీ నిర్మాణంలో ఉంటూనే తాను రాజకీయాల్లో కూడా కొనసాగుతాను అంటూ పేర్కొన్నాడు.

Tags:    

Similar News