పోయేకాలం కాకుంటే జాతీయ మీడియాకు బాలు ఘనత పట్టదా?

Update: 2020-09-27 15:30 GMT
భౌగోళికంగా ఎగువన ఉన్న రాష్ట్రాలకు.. కిందనున్న దక్షిణాది రాష్ట్రాలు అంటే అంత చులకన? అంటూ కొందరు తరచూ ఆవేశానికి గురవుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. సౌత్ అంటే నార్త్ కు ఉండే చిన్నచూపు తరచూ చర్చకు వస్తుంటుంది. ప్రతి విషయంలోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న ఆరోపణ తెలిసిందే. తాజాగా మీడియాకు ఈ తెగులు ఎక్కువే అంటూ తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగువాళ్లు.

ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా పదిహేడు భాషల్లో ఏకంగా 40వేలకు పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణిస్తే.. జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యతను తీవ్రంగా తప్పు పడుతున్నారు. దేశం గర్వపడే సింగర్ మరణిస్తే.. ఆయనకు ఇవ్వాల్సిన కనీస మర్యాద.. గౌరవాన్ని జాతీయ మీడియా ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బాలు మరణం పట్టకపోవటం కేవలం ఆయన సౌత్ కు చెందిన వారు కావటంతోనే అన్న కంప్లైంట్లు సోషల్ మీడియాలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సైతం బాలు మరణాన్ని గుర్తించి.. ప్రత్యేకించి తమ బులిటెన్లలో ఆయన గురించి గొప్పగా చెబితే.. అందుకు భిన్నంగా జాతీయ మీడియా మాత్రం ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదన్న మండిపాటు వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి ఎవరైనా ఉత్తరాదికి చెందిన ప్రముఖుడైతే.. ఆకాశానికి ఎత్తేసే వారని ఫైర్ అవుతున్నారు. నిత్యం నీతులు వల్లించే జాతీయ మీడియా.. ఇప్పటికైనా మేల్కొనకపోతే.. అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News