MGR ఏలిన నాటి రోజులు ఇప్పుడున్నాయా? దళపతి CM అవుతారా?
దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టివికే) పార్టీ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారాయి.;
దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టివికే) పార్టీ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడుకు మరోసారి గ్లామర్ రంగం నుంచి స్టార్ ముఖ్యమంత్రి అవుతారా? అన్న చర్చ వేడెక్కిస్తోంది. అయితే 1977లో ఎంజీఆర్ (MGR) రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? అధికార ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న సమయంలో విజయ్ చేసేది సాహసం అని అనుకోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉంది.
కోలీవుడ్ అగ్ర నటుడిగా దశాబ్ధాల పాటు ఏలిన ఎంజీఆర్ రాజకీయాల్లోను తనదైన దూకుడును ప్రదర్శించారు. డీఎంకే పార్టీలో కీలక నేతగా, కోశాధికారిగా పనిచేశారు. పార్టీ మూలాల నుంచి వచ్చారు. కానీ విజయ్ అలా కాదు. అతడు నేరుగా కొత్త పార్టీని స్థాపించారు. ఆయనకు పార్టీ సంస్థాగత అనుభవం తక్కువ.
అప్పట్లో కరుణానిధి మాత్రమే ఎంజీఆర్‌కి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు డిఎంకే, ఏఐ డిఎంకే లతో పాటు పెరిగిన బీజేపీ (అన్నామలై) ప్రభావాలను కూడా విజయ్ పార్టీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.
కేవలం సినిమాలు, పత్రికలే ఆధారంగా అప్పట్లో నాయకులు ప్రచారం సాగించేవారు. అలాగే ఎంజీఆర్ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు దేవుడి స్థాయి ఇమేజ్ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ఇక్కడ అభిమానం ఎంత వేగంగా పెరుగుతుందో.. ట్రోలింగ్ కూడా అంతే వేగంగా ఎదురవుతోంది. నేటి ప్రజల మైండ్ సెట్ ప్రకారం.. స్థిరమైన ఓటు బ్యాంకు కష్టమే.
అన్నాయిజం పేదల సంక్షేమంపై దృష్టి సారించింది. మధ్యాహ్న భోజన పథకం వంటివి ఎంజీఆర్ కాలంలో పెద్ద సక్సెసయ్యాయి. సెక్యులర్ సోషల్ జస్టిస్ (లౌకిక సామాజిక న్యాయం) తో పాటు అంబేద్కర్, పెరియార్ సిద్ధాంతాలను విజయ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇరు పార్టీల సిద్ధాంతాలు బలమైనవే. ఆదరణ పొందేవే.
కానీ తమిళనాడులో మారిన ఎన్నికల సీన్ ని దృష్టిలో ఉంచుకోవాలి. అప్పట్లో రాజకీయాలు కేవలం `ద్రవిడ` సిద్ధాంతం చుట్టూ తిరిగేవి. కానీ ఇప్పుడు యువ ఓటర్ల ప్రభావం అధికంగా ఉంది. తమిళనాడులో 18-35 ఏళ్ల ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. వీరికి ద్రవిడ సెంటిమెంట్ కంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అవినీతి రహిత పాలన ముఖ్యం. దీనినే విజయ్ తన `విజిల్` గుర్తుతో టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు డిఎంకే వర్సెస్ ఏఐఏ డిఎంకే పోటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు విజయ్ రావడంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.
గెలవాలంటే విజయ్ అనుసరించాల్సిన ఎత్తుగడలు:
విజయ్ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం తన సినిమాల గ్లామర్‌పైనే ఆధారపడకూడదు. అతడు తన పార్టీ కేడర్ ని బలంగా విస్తరించాల్సి ఉంటుంది. బూత్ స్థాయి నెట్‌వర్క్ ముఖ్యం. ఎంజీఆర్‌కు లక్షలాది మంది కార్యకర్తలు ఉండేవారు. విజయ్ కూడా తన ఫ్యాన్ క్లబ్స్‌ను పటిష్టమైన రాజకీయ క్యాడర్‌గా మార్చాలి. కేవలం డిఎంకేని తిడితే సరిపోదు.. తానూ ఏమి చేస్తాడో స్పష్టంగా చెప్పాలి. అందుకే ఆయన 1.5 కోట్ల మంది సభ్యత్వ నమోదు లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇది విజయ్ కి ప్లస్ అవుతుంది. విజయ్ చెన్నైలోని వేళచ్చేరి లేదా విరుగంబాక్కం లాంటి పట్టణ ప్రాంతాలతో పాటు.. మైనారిటీలు ఎక్కువగా ఉండే తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఫిలింస్టార్లకు ఇప్పుడు రాజకీయాలు వర్కవుట్ అవుతాయా? అంటే. ... గ్లామర్ రంగం నుంచి వచ్చిన ప్రముఖ కథానాయకుడు విజయకాంత్ ఒకప్పుడు రాజకీయాల్లో `కింగ్ మేకర్` అయ్యారు కానీ తర్వాత కనుమరుగయ్యారు. విశ్వనటుడు కమల్ హాసన్ విద్యావంతుల ఓట్లు తెచ్చుకున్నా, అసెంబ్లీలో సీట్లు గెలవలేకపోయారు. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. చిరంజీవి వంటి టాలీవుడ్ స్టార్ రాజకీయ పార్టీని ప్రారంభించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసారు.
నేటితరంలో ఎవరికీ ఎంజీఆర్, జయలలిత రేంజు లేదు. ప్రస్తుత ఏఐఏడిఎంకే లో ఎంజీఆర్ లేదా జయలలిత వంటి పవర్‌ఫుల్ లీడర్ లేకపోవడం విజయ్‌కు కలిసొచ్చే అంశం. ఒకవేళ ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోగలిగితే కచ్చితంగా ఎంజీఆర్ చరిత్రను పునరావృతం చేసే అవకాశం ఉంది. విజయ్ తన మొదటి బహిరంగ సభను విక్రవాండి లో నిర్వహించినప్పుడు వచ్చిన స్పందన చూస్తే, ప్రజల్లో మార్పు కోరుకునే వర్గం ఆయన వైపు చూస్తోందని అర్థమవుతోంది. విజయ్ తన సినిమాల్లో చెప్పినట్లు నాయకుడిగా ఎదగాలంటే ప్రజల కన్నీళ్లు తుడవాలి! .. దీనిని అతడు ప్రయత్నిస్తున్నారు. ఇది నిజంగా ఓట్లుగా మారుతుందా లేదా అనేది 2026 ఎన్నికల ఫలితాలే చెప్పాలి.