ఎస్పీ బాలుకు భారతరత్న ప్రకటించాల్సిందే ..పెరిగిపోతున్న అభిమానుల మద్దతు !

Update: 2020-09-26 09:10 GMT
ఎస్పీ బాలసుబ్రమణ్యం .. ఇదొక పేరు మాత్రమే కాదు..ఓ మరపురాని చరిత్ర. మనం మరిచిపోలేని ఓ అధ్యాయం.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. 50 ఏళ్లు సంగీత ప్రపంచాన్ని ఏలిన ధీరుడు. పాటల పూదోటలో రారాజు, ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత రాసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే బాలు అంటే కారణజన్ముడు అంతే. అలాంటి గాయకుడు.. లెజెండరీ పర్సనాలిటీ మళ్లీ పుట్టడం కూడా అసాధ్యం. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 17 భాషలు.. 45 వేల పాటలు అంటే సామాన్య విషయం కాదు. ప్రపంచంలో మరే గాయకుడికి సాధ్యం కాని రికార్డు ఇది. తెలుగులో ఘంటసాల లాంటి గాయకుడు మరణించిన తర్వాత ఆయన్ని మరిపించే గాయకుడు మళ్లీ వస్తాడా అంటే ఎస్పీ బాలు నేనున్నానంటూ వచ్చాడు. 5 దశాబ్ధాలుగా ఈయన అద్భుతమైన స్వరాన్ని మనం వింటూనే ఉన్నాం. కానీ , ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది. ఇక సెలవు అంటూ మరలిరాని లోకాలకు పయనమైంది.

ఇదిలా ఉంటే ఎస్పీ బాలసుబ్రమణ్యానికి భారతదేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న ఇవ్వాలంటూ అభిమానుల నుంచి డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. సంగీత ప్రపంచానికి ఈయన చేసిన సేవలు మాటల్లో చెప్పడం సాధ్యం కాదని.. భారతీయ సంగీతం అంటే బాలు అనే స్థాయికి ఆయన ఎదిగిన విషయం గుర్తించుకోవాలంటున్నారు అభిమానులు.అలాగే ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ సంగీత దర్శకుడు కోటితో పాటు జానకమ్మ, చిత్ర లాంటి వాళ్లు కూడా బాలుకు భారతరత్న ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. అది ఆయనకు మనం ఇచ్చుకునే గౌరవం అని చెప్తున్నారు. ఆ పురస్కారాన్ని అందుకునే అన్ని అర్హతలు ఎస్పీ బాలుకు ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆయన పేరును ఎంపిక చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. Bharat Ratna హ్యాష్ ‌ట్యాగ్ ‌ను సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. భారత రత్నఅవార్డును అందుకునే అన్ని అర్హతలు ఎస్పీ బాలుకు ఉన్నాయని, తమ అభిప్రాయాలతో కూడిన పోస్టింగులలను ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేస్తున్నారు. సామాన్యులతో పాటుగా ప్రముఖులు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల జాబితాలో ఆయన పేరును చేర్చాలనీ కోరుతున్నారు. ఇక ఇప్పటికే బాలసుబ్రమణ్యంకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మభూషణ్ సత్కారాలు పురస్కరించింది. 2001లో పద్మ శ్రీ.. 2011లో పద్మభూషణ్ ఈయన్ని వరించాయి.
Tags:    

Similar News