వీకెండ్‌ అయ్యింది.. ఏమాత్రం వీక్‌ అవ్వలా!

Update: 2015-07-13 17:16 GMT
వీకెండ్‌లో ఎలాంటి సినిమాలకైనా ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. సినిమా అసలు సత్తా ఏంటన్నది తెలిసేది సోమవారమే. గతంలో వీకెండ్‌లో అదరగొట్టి.. సోమవారం రాగానే వీక్‌ అయిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. బాహుబలి సోమవారం నాటికి వీక్‌ అయిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు కానీ.. కొంచెమైనా జోరు తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించట్లేదు. బుకింగ్స్‌ చూస్తుంటే ప్రతి షో కూడా హౌస్‌ఫుల్‌గానే కనిపిస్తోంది. ఆదివారం వరకు టికెట్ల కోసం ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. ఐతే వీకెండ్‌లో టికెట్లు దొరకని జనాలంతా సోమవారం తర్వాత ఎప్పుడు దొరికితే అప్పుడు టికెట్లు కొని పెట్టేసుకున్నారు.

ఇక థియేటర్లకు నేరుగా వెళ్లేవాళ్లు ఎలాగూ ఉంటారు కాబట్టి ప్రతి థియేటర్‌ దగ్గరా ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. నగరాల్లో మాత్రమే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. హౌస్‌ఫుల్‌ పడని చోట కూడా 80-90 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. దీంతో సోమవారం వసూళ్లు కూడా కనీవినీ ఎరుగని రీతిలోనే ఉంటాయని తెలుస్తోంది. సౌత్‌ ఇండియా మొత్తంలో పరిస్థితి ఇలాగే ఉంది. తమిళనాట తొలి రోజుతో పోలిస్తే రెండు, మూడు రోజుల్లో బుకింగ్స్‌, కలెక్షన్లు ఎక్కువుండటటం విశేషం. కర్ణాటకలో తెలుగు వెర్షన్‌ చూడ్డానికి కన్నడ జనాలు కూడా తెగ ఎగబడుతున్నారు. మలయాళంలో తొలి రోజు బాహుబలికి ఎక్కువ థియేటర్లు లభించలేదు. రెండో రోజు నుంచి లైన్‌ క్లియరవడంతో అక్కడ కూడా బాహుబలి రచ్చ రచ్చ చేస్తోంది. చూస్తుంటే ఈ వీక్‌ అంతా బాహుబలి హవా కొనసాగేలా కనిపిస్తోంది.
Tags:    

Similar News