ఎన్టీఆర్ గురించి ఎవరికీ చెప్పని విషయం ఒకటుంది: అశ్వనీదత్!

Update: 2022-08-17 23:30 GMT
ఎన్టీరామారావుకి ముందు ఎంతోమంది ఆర్టిస్టులు తెరపై తమ ప్రత్యేకతను కనబరిచారు. ఆ తరువాత  కూడా ఎంతోమంది తమదైన ముద్ర వేశారు. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ కి ఉన్న స్థానం వేరు. భూతద్దం పట్టుకుని చూసినా అలాంటి నటుడు ఏ భాషలోను కనిపించడు. ఆయన గ్లామర్ ముందు తేలిపోకుండా చూసుకోవడానికి హీరోయిన్లు నానా పాట్లు పడేవారు. అలాంటి ఎన్టీఆర్ భోళామనిషి అని చాలామంది చెబుతుంటారు. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం .. గౌరవించడం .. మాటకి కట్టుబడి ఉండటం ఆయన ప్రత్యేకతగా చెబుతారు.

అలాంటి ఎన్టీఆర్ తో ఒక సినిమా తీసినా చాలని అప్పట్లో నిర్మాతలు అనుకునేవారు. ఆయనతో తప్పకుండా ఒక సినిమా తీయాలనే పట్టుదలతో ఇండస్ట్రీకి వచ్చినారు చాలామందినే ఉన్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారిలో అశ్వనీదత్ కూడా ఒకరిగా కనిపిస్తారు.

ఆయన బ్యానర్ లోగోలో ఎన్టీఆర్ కనిపిస్తూ ఉంటారంటే ఎన్టీఆర్ పట్ల ఆయనకి ఎంతటి అభిమానం ఉందనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా 'ఆలీ తో సరదాగా' కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన, ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు.

"ఎన్టీఆర్ గారి గురించి ఇంతవరకూ నేను ఎక్కడా ఎప్పుడూ చెప్పని ఒక విషయం చెబుతాను. 'ఎదురులేని మనిషి' సినిమాను ఎన్టీఆర్ గారితో చేయాలని అనుకున్నప్పుడు ఆయన తన పారితోషికం ఇంతని చెప్పలేదు .. ఎంతని నేను అడగలేదు.

ఆ తరువాత కథానాయికగా వాణిశ్రీ గారిని తీసుకోవడం జరిగింది. అప్పటికి వరుస హిట్లతో ఆమె దూసుకుపోతున్నారు. పారితోషికంగా ఆమె 2 లక్షలు అడిగారు. ఆమెనే కావాలని అనుకుంటున్నాము గనుక అలాగే ఇచ్చాము. షూటింగు నడుస్తూ వెళుతోంది.

ఎన్టీఆర్ కి లక్షా డెబ్భై ఐదు వేలు ముట్టాయి. వాణిశ్రీ గారికి 2 లక్షలు ఇచ్చాం గనుక ... ఎన్టీఆర్ రెండున్నర అడగొచ్చని అనుకున్నాను. అందువలన మిగతా బ్యాలెన్స్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్లాను. పేపర్లో చుట్టిన డబ్బును ఆయనకి అందజేశాను. 'పొట్లం పెద్దగా కనిపిస్తుందేంటి?' అంటూ ఆయన డబ్బు చూసుకున్నారు. 'మనం తీసుకునేది 2 లక్షలే' అంటూ ఒక పాతికవేలు తీసుకుని మిగతా ఎమౌంట్ తిరిగి ఇచ్చేశారు. అది ఎన్టీఆర్ గొప్పతనమంటే. అదే పద్ధతిని ఏఎన్నార్ లోను చూశాను. ఆ క్రమశిక్షణను కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. చిరంజీవిలోను చూశాను" అంటూ చెప్పుకొచ్చారు. 
Tags:    

Similar News