రచ్చకెక్కిన అపరిచితుడు హిందీ రీమేక్.. దర్శకుడికు లీగల్ నోటీసులు!

Update: 2021-04-15 09:30 GMT
స్టార్ డైరెక్టర్ శంకర్ తను తెరకెక్కించిన సూపర్ హిట్ అన్నీయన్‌(అపరిచితుడు) మూవీని హిందీలో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ ప్రకటించిన మరుసటి రోజే అది 'చట్టవిరుద్ధం' అంటూ అన్నియన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.. శంకర్ కు ఓ నోటిస్ పంపించారు. చియాన్ విక్రమ్ నటించిన అన్నీయన్ సర్వహక్కులు ఇప్పటికీ తన వద్దే ఉన్నాయని, ఇంకా ఎవరికీ అమ్మలేదని ఆస్కార్ వి రవిచంద్రన్ పేర్కొన్నాడు. అసలు శంకర్ ఇలా ఎలా "తక్కువ స్థాయికి దిగజారాడు" వెంటనే హిందీ రీమేక్ చర్యలను ఆపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారిన రవిచంద్రన్ నోటీసు ఇలా ఉంది.

"డైరెక్టర్ శంకర్.. అన్నీయన్ అనే సినిమా కథతో ద్వారా మీరు హిందీలో రీమేక్ చేస్తున్నారని తెలిసి షాకయ్యాను. అన్నీయన్ చిత్రానికి నిర్మాత నేనే అనే విషయం మీకు బాగా తెలుసు. మొత్తం కథపరంగా అన్ని హక్కులను రచయిత సుజాత (అలియాస్ దివంగత రంగరాజన్) నుండి నేను కొనుక్కున్నాను. అందుకోసం నేను రచయితకు పూర్తి డబ్బులు చెల్లించాను. వాటి రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నియన్ కథ పై పూర్తి హక్కులు నావే. ఈ సినిమా విషయంలో నా అనుమతి లేకుండా మెయిన్ స్టోరీ లైన్ అనుసరించడం, రీమేక్ చేయడం లేదా కాపీ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం."

“ఇంకా, మీరు తెరకెక్కించిన బాయ్స్ మూవీ హిట్ అయ్యాక.. తదుపరి సినిమా విషయంలో మీరు చాలా ఒత్తిడికి గురయ్యారని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అయినా కూడా అన్నీయన్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని నేను మీకు ఇచ్చాను. ఆ తర్వాతే మీరు కోల్పోయిన భూమిని తిరిగి సొంతం చేసుకున్నారు. ఇదంతా కేవలం నా మద్దతు కారణంగా మాత్రమే జరిగింది. మీరు ఇదంతా మరచి.. నాకు సమాచారం ఇవ్వకుండా 'అన్నీయన్' హిందీ వెర్షన్‌ను అనుసరించడం సారీ చెప్పినా సరిపోదు. ఎల్లప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు తక్కువ స్థాయికి ఎలా చేర్చుకున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. మొత్తం హక్కులు నా వద్ద ఉన్న కారణంగా స్టోరీ లైన్ కాపీ చేయడం ఆపాలని ముందుగానే సలహా ఇస్తున్నాను. ఈ లేఖతో చట్టపరమైన నోటీసుగా వర్తిస్తుందని దయచేసి గమనించండి. ఆస్కార్ వి రవిచంద్రన్."

ప్రస్తుతం శంకర్ కు పంపిన ఈ లీగల్ నోటీసు ఇష్యూ ఇటు సోషల్ మీడియాలో, అటు ఇండస్ట్రీలో చర్చలకు దారితీస్తోంది. మరి దీనిపై డైరెక్టర్ శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.




Tags:    

Similar News