సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం..

Update: 2020-12-29 05:05 GMT
కరోనా వణికిస్తున్న వేళ.. తెరపై హీరోలంతా నిజ జీవితంలో మౌనంగా ఉంటే.. అదే తెరపై విలన్ మాత్రం రియల్ లైఫ్ లో నిజమైన హీరోగా ముందుకు కదిలాడు. సాయం కోసం అర్థించిన ప్రతీ చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు. నేనున్నానంటూ అండగా నిలిచాడు. చేతికి ఎముకే లేదన్నట్టుగా సాగిన ఆ సహాయ పర్వం.. నిస్సహాయులందరికీ ఆపన్న హస్తమైంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు సోనూ సూద్. సినిమాల్లో తను సంపాదించిందంతా ధారాదత్తం చేశాడు. చివరకు తన ఇల్లు కూడా తాకట్టు పెట్టాడని వార్తలు వచ్చాయి. తన త్యాగంతో.. సేవతో.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు సోనూ. ఇప్పుడు సోనూసూద్ ఓ నేషనల్ ఐకాన్. అతనో రియల్ హీరో. ఇంత చేసిన సోనూకు ఎన్నో గౌరవాలు దక్కాయి. తాజాగా.. మరో అవార్డు ఆయనకు దక్కబోతోంది.

‘హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డును సోనూ అందుకోబోతున్నారు. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్, నార్వే చేత ఈ గౌరవాన్ని పొందబోతున్నాడు ఈ హీరో. ఈ డిసెంబరు 30 న ఈ అవార్డును సోనుసూద్‌కు అందజేయనున్నట్లు సమాచారం. ఇలాంటి ఎన్నో గౌరవాలకు అర్హుడైన సోనూసూద్ ను మనం కూడా మనసారా అభినందిద్దాం.
Tags:    

Similar News