అషురెడ్డి తిరిగి బెదిరించిందా? ఆడియో రికార్డింగ్ నిజమేనా?
పెళ్లి పేరుతో మోసం చేశారని ఆరోపణలతో బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి అషు రెడ్డి చుట్టూ వివాదం మరింత ముదురుతోంది.;
పెళ్లి పేరుతో మోసం చేశారని ఆరోపణలతో బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి అషు రెడ్డి చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర నుంచి సుమారు రూ.9.5 కోట్లు వసూలు చేశారనే కేసులో ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఆడియో కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కేసులో కొత్త మలుపు తీసుకొచ్చింది.
వైరల్ అవుతున్న ఆ ఆడియోలో అషు రెడ్డి.. ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తోంది. ఆ కన్వర్జేషన్ లో ఆమె తీసుకున్న మొత్తంలో కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే ప్రస్తుతం తిరిగి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా డబ్బులు తాను లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే ఇస్తానని పేర్కొన్నట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
అంతేకాదు, తాను చెప్పిన విధంగా ఒప్పందానికి రాకపోతే వేధింపుల కేసు పెడతానని కూడా హెచ్చరించినట్లు ఆ రికార్డింగ్‌లో ఉంది. 'మే నెల వరకు సమయం ఇస్తే రూ.1.5 కోట్లు అకౌంట్ ద్వారా ఇస్తాను. మిగిలిన డబ్బులు తర్వాత చూస్తాను. లేదంటే నేను వేధింపులు కేసులు పెడతాను' అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నావంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు మీడియేటర్స్ ను కొంతమందిని తీసుకురావాలని కూడా ఆమె సూచించినట్లు ఆడియోలో వినిపిస్తోంది. ప్రవీణ అనే మహిళ, అలాగే జ్యోతిష్యుడు వేణుస్వామి తన తరఫున వస్తారని, ఇంట్లో వాళ్లకు సంబంధం లేకుండా మాట్లాడుకుని రాజీ అవుదామని చెప్పినట్లు తెలుస్తోంది. లేకపోతే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయని హెచ్చరించినట్లుగా వినిపిస్తోంది. అయితే ఆ ఆడియో కాల్ అసలు నిజమా కాదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం అది కేవలం నెట్టింట మాత్రమే తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారికంగా పోలీసులు లేదా సంబంధిత వ్యక్తులు ఎవరూ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ ఆడియో వెలుగులోకి రావడం కేసులో కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే నమోదైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్, వ్యక్తిగత సంబంధాలు, కాల్ రికార్డింగ్లు వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అవసరమైతే ఆ వైరల్ అవుతున్న ఆడియోను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు పెళ్లి పేరుతో భారీ మొత్తంలో మోసం చేశారనే ఆరోపణలతో మొదలైన అషు రెడ్డి కేసు, బెదిరింపుల ఆరోపణల దిశగా కొత్త మలుపు తిరిగింది. వైరల్ ఆడియో నిజమైతే అషు రెడ్డికి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. లేదంటే ఇది మరొక కొత్త వివాదానికి దారి తీయవచ్చు. ప్రస్తుతం ఆ కేసు ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.