హైకోర్టులో అషురెడ్డి పిటిషన్.. నెక్స్ట్ ఏం జరగనుంది?
బిగ్ బాస్ ఫేమ్, నటి అషురెడ్డి చుట్టూ ఆర్థిక మోసం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.;
బిగ్ బాస్ ఫేమ్, నటి అషురెడ్డి చుట్టూ ఆర్థిక మోసం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం కొత్త మలుపు తీసుకొచ్చింది. లండన్ లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ.9.35 కోట్ల వరకు మోసం చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం తెలిసిందే.
ఆ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమని అషు రెడ్డి తన క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. తన వెర్షన్ ను తీసుకోకుండా, ఏకపక్షంగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్ట దెబ్బతీయడానికే ఆ కేసు పెట్టారని పేర్కొన్నారు. వెంటనే ఆ కేసు విచారణపై స్టే విధించాలని, తదుపరి చర్యల నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును కోరారు.
ఇక పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా అషురెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం తన వివరణ తీసుకోకుండా కేసు నమోదు చేయడం న్యాయపరంగా సరైంది కాదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆమె పిటిషన్ ను త్వరలో విచారించే అవకాశం ఉంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో కేసును పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బాధితుడిగా చెప్పుకుంటున్న ఎన్నారై సమర్పించిన ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారట. ముఖ్యంగా భారీ మొత్తంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీలు, బంగారం కొనుగోళ్లు వంటి విషయాలపై సాక్ష్యాలను సేకరిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాద్ షేక్ పేట్ కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
2018లో భారత్ కు వచ్చిన సమయంలో అతనికి అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువుకుని సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చానని చెప్పి అతనికి దగ్గరయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వివిధ ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు తీసుకుందని ఆరోపించారు. కారు, బంగారం, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేయించి, అవన్నీ తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకుందని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి జరగబోతోందని నమ్మించి, చివరికి వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చిందని చెప్పారు.
2025 వరకు మొత్తం రూ.9.35 కోట్ల విలువైన నగదు, సుమారు ఐదు కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనంగా అషురెడ్డి సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకుందని ఆరోపించారు. పలుమార్లు వివరణ కోరినా, చివరికి పెళ్లికి నిరాకరించిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండగా, హైకోర్టు తీర్పు ఏమిటన్న దానిపై అందరి దృష్టి నిలిచింది.