'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి మరో అరుదైన గౌరవం..!

Update: 2021-05-14 02:30 GMT
దక్షిణాది అగ్ర కథానాయకుడు సూర్య నటించిన 'సూరారై పోట్రు' సినిమా తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సిఖ్య - 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై సూర్య ఈ సినిమాని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన బ్లాక్ బస్టర్ 'ఆకాశం నీ హద్దురా' సినిమా.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.

షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2021 పనోరమా విభాగంలోకి 'ఆకాశం నీ హద్దురా' సినిమా ప్రవేశించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నిర్మాత రాజశేఖర్ పాండియన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియా కిచెన్' కూడా ఎంపికైంది. కాగా, సామాన్యుడికి త‌క్కువ ధ‌ర‌కే విమాన ప్రయాణ అవకాశం అందించిన ఎయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ జీవితకథ ఆధారంగా 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా.. మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Tags:    

Similar News