నా మాటలను వక్రీకరించారు..నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు
శివాజీ వ్యాఖ్యల పట్ల అనసూయ స్పందించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది. అయితే ఈ విషయంలో తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ మరోసారి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.;
శివాజీ వ్యాఖ్యల పట్ల అనసూయ స్పందించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది. అయితే ఈ విషయంలో తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ మరోసారి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతూ, అసలు తాను ఏం చెప్పాలనుకున్నానో, దాన్ని బయట జనాలు ఎలా వక్రీకరించారో అనే దాని గురించి వివరించారు. ముఖ్యంగా తాను ఎప్పుడూ అందరూ వెస్ట్రన్ బట్టలే వేసుకోవాలని చెప్పలేదని, తన ఛాయిస్ ని ఎవరి మీదా రుద్దలేదని అన్నారు.
కేవలం ప్రతి స్త్రీకి తనకు నచ్చింది ధరించే స్వేచ్ఛ ఉండాలని, ఆ స్వేచ్ఛను గౌరవించాలని మాత్రమే తాను అన్నానని, దాన్ని హైలెట్ చేసి తప్పుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని బాధ్యతారాహిత్య మీడియా సంస్థలు, చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని తమను తాము జర్నలిస్టులుగా భావించే కొందరు 'సివిక్ ఇల్లిటరేట్స్' కావాలనే తన మాటలను ట్విస్ట్ చేశారని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టడానికి, తప్పుదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగానే కొన్ని 'మానిప్యులేటివ్ నెరేటివ్స్' క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.
తన వ్యాఖ్యలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, వారికి నచ్చినట్లుగా మార్చుకుని తనపై విషం చిమ్ముతున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. అందరికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ వివాదంతో ఏమాత్రం సంబంధం లేని తన భర్తను, చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగి అవమానిస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ వేసుకునే బట్టలను బట్టి ఆమె క్యారెక్టర్ ని నిర్ణయించడం కరెక్ట్ కాదని అన్నారు.
కేవలం డ్రెస్సింగ్ ని బేస్ చేసుకుని ఒక మనిషిని జడ్జ్ చేయడం, వారి కుటుంబాన్ని నిందించడం 'విక్టిమ్ షేమింగ్' కిందకే వస్తుందని, ఇలాంటి వాటికి తాను భయపడనని తేల్చిచెప్పారు. నిజానికి ఇక్కడ జరుగుతున్న రచ్చ బట్టల గురించి కాదని, ఇది పూర్తిగా ఆడవాళ్ల మీద 'కంట్రోల్' సాధించాలనే పితృస్వామ్య ధోరణి అని అనసూయ అభిప్రాయపడ్డారు.
సొంతంగా ఆలోచించి, సొంత గొంతుక వినిపించే ఆడవాళ్లంటే ఈ సమాజానికి భయం అని, అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పినందుకు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పనని, తన దారిలోనే తాను నడుస్తానని చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసే హేటర్స్ కు కూడా అనసూయ తనదైన శైలిలో చురకలు అంటించారు.
"నన్ను ద్వేషించే వాళ్ళకు నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది.. మీకు కోపం తెప్పించే విషయాలు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి.. కాస్త ఓపిక పట్టండి" అంటూ సెటైర్ వేశారు. అంతేకాకుండా, "మీకు నేను నచ్చకపోయినా, నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారంటే.. ఒకరకంగా మీరు కూడా నా ఫ్యాన్సే. ఈ నిజాన్ని అంగీకరించండి" అంటూ వివరణ ఇచ్చారు.