పోలీసులు అరెస్టు చేయలేరంటూ షాకింగ్ వీడియో రిలీజ్

Update: 2021-08-13 09:30 GMT
సంచలనాలకు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది నటి కమ్ మోడల్ మీరా మిథున్. బిగ్ బాస్ ఫేం అయిన ఈ అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులతో పాటు.. ఏడు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఆమె అరెస్టు అనివార్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. తనను టార్గెట్ చేశారంటూ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

అందులో ప్రధాని నరేంద్ర మోడీ.. తమిళనాడురాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ను పదే పదే విజ్ఞప్తి చేస్తూ.. తనకు రక్షణ కల్పించాలని కోరిన ఆమె.. తనను పోలీసులు అరెస్టు చేయలేరంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సినీ ఇండస్ట్రీలో మగవాడి ఆశలకు లొంగిపోతేనే ఛాన్సులు దరికి చేరుతాయని.. అందుకే ఇతర రాష్ట్రాల వారు విజయాలు సాధిస్తున్నట్లుగా మీరా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకు మించిన వివాదాన్ని రేపాయి.

సదరు వీడియోలో ఇతర రాష్ట్రాలకు చెందిన నటీమణుల్ని ఉద్దేశించి మీరా చేసిన వ్యాఖ్యల్ని పలువురు ఖండిస్తున్నారు. తమిళనాడుకు చెందిన బిడ్డగా పేర్కొన్న ఆమె అవసరం లేకున్నా తన సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. ఆ వర్గానికి చెందిన మహిళనైన తనను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తానేం చెప్పినా వివాదం చేస్తున్నట్లు ఆమె వాపోయారు. సూటిగా.. స్పష్టంగా చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి.. తాను ఒక సామాజిక వర్గాన్ని కించపరిచినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆమె పోలీసుల్ని కోరటం గమనార్హం.

తన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేసే వేళ.. తన గురించి అత్యంత నీచంగా.. అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు.. ఆరోపణలు.. చర్చల మీద చర్యలు తీసుకోరేం? అని ఆమె పోలీసుల్ని ప్రశ్నిస్తున్న వైనం సంచలనంగా మారింది. తనపై పెట్టిన పోస్టుల సంగతేమిటన్న ఆమె మాటలకు పోలీసులు స్పందన ఏమిటో చూడాలి.


Tags:    

Similar News