జైలర్ 2, రామాయణం.. నాగవంశీ, దిల్ రాజు ఎందుకంత రిస్క్?

నాగవంశీ, దిల్ రాజు లాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఇంత అనుభవం పెట్టుకుని తెలిసి తెలిసి అంత పెద్ద రిస్క్ తీసుకుంటారా అనిపిస్తుంది.

Update: 2026-09-26 05:13 GMT

ఒక సినిమా హిట్ అయితే సరే.. తేడా కొడితే? జైలర్ 2, రామాయణం రైట్స్ కోసం వినిపిస్తున్న భారీ నంబర్లు చూస్తే మొదట వచ్చే డౌట్ ఇదే. నాగవంశీ, దిల్ రాజు లాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఇంత అనుభవం పెట్టుకుని తెలిసి తెలిసి అంత పెద్ద రిస్క్ తీసుకుంటారా అనిపిస్తుంది. కానీ బయటకు కనిపించే డీల్ వాల్యూ, వాళ్ల మీద పడే అసలు రిస్క్ రెండూ ప్రతిసారి ఒకేలా ఉండవు.

కొన్ని మినిమమ్ గ్యారంటీ బేసిస్‌లో ఉంటాయి. సినిమా ఆడకపోతే అక్కడ డిస్ట్రిబ్యూటర్‌కు దెబ్బ ఎక్కువగా పడొచ్చు. మరికొన్ని రిటర్నబుల్ అడ్వాన్స్, కమిషన్ లేదా ముందే ఫిక్స్ చేసిన షరతులతో జరుగుతాయి. కలెక్షన్స్ అనుకున్న స్థాయికి రాకపోతే ఎంత మొత్తం తిరిగి రావాలి, ఎవరు ఎంత భారం తీసుకోవాలి అన్నది ముందే అగ్రిమెంట్‌లో పెట్టుకునే అవకాశముంటుంది.

రామాయణం తెలుగు హక్కుల కోసం దిల్ రాజు రూ.105 కోట్ల వరకు వెళ్లే డీల్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో చర్చల్లో ఉందని ట్రేడ్ వర్గాల్లో సమాచారం. అది ఫైనల్ అయితే మొత్తం రూ.105 కోట్లు ఒకేలా రిస్క్‌లో ఉన్నాయని అర్థం కాదు. సినిమా బిజినెస్, ఒప్పందంలోని షరతులను బట్టి చివరి సెటిల్‌మెంట్ మారొచ్చు. టాక్సిక్ తెలుగు హక్కుల విషయంలో కూడా రిటర్నబుల్ మోడల్ గురించి గతంలో వార్తలు వచ్చాయి.

నాగవంశీ కూడా ఇటీవల కాలంలో ఇలాంటి డీల్స్ చూశారు. వార్ 2 తెలుగు హక్కులు రూ.68 కోట్లకు తీసుకున్నానని, సినిమా నుంచి రూ.35 నుంచి 40 కోట్ల షేర్ వచ్చిందని ఆయనే చెప్పారు. ముందే పెట్టుకున్న షరతు ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ రూ.18 కోట్లు తిరిగి ఇచ్చిందని కూడా వెల్లడించారు. అంటే పెద్ద సినిమా తేడా కొట్టినా, ముందే మాట్లాడుకున్న రక్షణ ఉంటే నష్టం కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు జైలర్ 2 కోసం వినిపిస్తున్న రూ.90 కోట్లకు పైగా డీల్ కూడా ఏపీ, తెలంగాణతో ఆగడం లేదు. నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్ మార్కెట్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల రిలీజ్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఓవర్సీస్‌ను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్ చేయనున్నాయి.

అయితే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు స్టార్ క్రేజ్ చూసి మాత్రమే ఇలాంటి డీల్స్ దగ్గరకు వెళ్లరు. ఏ మార్కెట్ నుంచి ఎంత రికవరీ రావొచ్చు, ఓవర్సీస్ ఎంత ఇస్తుంది, అడ్వాన్స్ ఎంత, తమ రిస్క్ ఎక్కడ వరకు అన్నది ముందే కూర్చుని మాట్లాడుకుంటారు. అయినా ఎంజీ డీల్‌లో సినిమా పడిపోతే నష్టం తప్పదు. జైలర్ 2 ఒప్పందం ఏ మోడల్‌లో జరిగిందన్న పూర్తి వివరాలు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా పూర్తిగా బయటకు రాలేదు. ఇక నాగవంశీ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News