ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం లేదు:ఆమీర్ ఖాన్

Update: 2018-08-02 13:36 GMT
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ - పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ (65)...ఈ నెల 11న పాక్ ప్ర‌ధానిగా ప్రమాణ స్వీకారం చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త ప్ర‌ధాని మోదీతో పాటు సార్క్ దేశాధ్య‌క్షులు - ప్రముఖ క్రికెటర్లు సునీల్‌ గవాస్కర్‌ - కపిల్‌ దేవ్‌ - నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ - బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ల‌ను ఇమ్రాన్ ఆహ్వానించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలను ఎవ‌రినీ ఆహ్వానించడం లేదని - ఇమ్రాన్ కు అత్యంత సన్నిహతులైన  కొందరు విదేశీ వ్యక్తులను మాత్రమే ఆహ్వానించామ‌ని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో ఆ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఆహ్వానంపై ఆమిర్ ఖాన్ స్సందించారు. ఆ కార్య‌క్ర‌మానికి తాను హాజరు కావడం లేదని ఆమిర్ స్ప‌ష్టం చేశారు.

ఈ రోజు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమిర్ ఖాన్...ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకార వేడుక ఆహ్వానంపై క్లారిటీ ఇచ్చారు. ఆ కార్య‌క్ర‌మానికి సంబంధించి తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని చెప్పారు. తాను `పానీ` ఫౌండేషన్ చేప‌ట్టిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నానని ఆమిర్ అన్నారు. ఆగస్టు 12న జరిగే `పానీ`ఫౌండేష‌న్ కార్యక్రమం కోసం తాను స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొనే కార్య‌క్ర‌మాన్ని భారీస్థాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. మ‌రోవైపు, ఇమ్రాన్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి త‌న‌కు ఆహ్వానం అందింద‌ని, ఆ కార్య‌క్రమానికి తాను హాజ‌ర‌వుతున్నాన‌ని న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూ స్ప‌ష్టం చేశారు.



Tags:    

Similar News