రఘువరన్ వల్లే సినిమాలకు దూరం.. రివీల్ చేసిన రోహిణి
సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా, రైటర్ గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రోహిణి తాజాగా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా, రైటర్ గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రోహిణి తాజాగా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా నటుడు రఘువరన్‌తో పెళ్లి తర్వాత ఎందుకు సినిమాలకు దూరమయ్యాననే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిణి, పెళ్లి తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం రఘువరన్ ఆలోచనా విధానమేనని వెల్లడించారు. పెళ్లి తర్వాత తాను నటిగా కంటిన్యూ అవడానికి ఆయనెప్పుడూ ప్రోత్సహించలేదని, ఇంట్లోనే హౌస్ వైఫ్ గా జీవించాలని ఆయన ఆశించినట్టు రోహిణి వెల్లడించారు.
1996లో రోహిణి, రఘువరన్ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ తమ తమ రంగాల్లో అత్యంత గుర్తింపు పొందిన నటులుగా ఉన్నారు. 1998లో వీరికి రిషి అనే కొడుకు పుట్టాడు. అయితే కాలక్రమేణా అభిప్రాయ భేదాలు పెరగడంతో 2004లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం 2008లో రఘువరన్ కన్నుమూశారు. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ, రఘువరన్ పెరిగిన కుటుంబ వాతావరణమే అతనిపై ప్రభావం చూపిందని తెలిపారు. వారి ఫ్యామిలీలో మహిళలు జాబ్స్ చేయడం లేదా బయటకు వెళ్లి పనిచేయడం సాధారణమైన విషయం కాదని, అదే భావజాలం ఆయనలో కూడా ఉండేదని చెప్పారు. భార్య ఇంట్లోనే ఉండాలి, భర్త సంరక్షణలోనే ఉండాలనే ఆలోచన ఆయనకు బలంగా ఉండేదని వెల్లడించారు.
ఆ కారణంగానే తాను తన కెరీర్‌ను పక్కన పెట్టి కొన్నేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నానని రోహిణి చెప్పారు. అయితే ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని, తీవ్ర పోరాటం తర్వాతే మళ్లీ సినిమాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత కేవలం నటిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నానని ఆమె గుర్తు చేశారు.
ఇక తన 52 ఏళ్ల సినీ ప్రయాణాన్ని కేవలం రఘువరన్ మాజీ భార్య అనే గుర్తింపుతో పరిమితం చేయడంపై కూడా రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల వయసులోనే బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన తాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 130కి పైగా సినిమాల్లో నటించానని రోహిణి గుర్తుచేశారు. 1995లో వచ్చిన స్త్రీ సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు నంది ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా అందుకున్నట్లు తెలిపారు. తన జీవితంలో రఘువరన్ ఒక ముఖ్యమైన వ్యక్తే అయినప్పటికీ, తన ఐదు దశాబ్దాల కెరీర్‌ను ఆ ఒక్క సంబంధంతోనే నిర్వచించడం బాధ కలిగిస్తుందని రోహిణి స్పష్టం చేశారు. ఇక మీదటనైనా పర్సనల్ లైఫ్ పై కాకుండా, నటిగా మరియు క్రియేటివ్ ఆర్టిస్ట్ గా చేసిన పనుల గురించి మాట్లాడాలని ఆమె అందరినీ కోరారు.