'బజరంగీ భాయిజాన్' కథను ముందుగా ఆమీర్ ఖాన్ విన్నాడట!

Update: 2021-06-01 07:30 GMT
తెలుగులో సీనియర్ సినీ రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. దాదాపుగా రాజమౌళి సినిమాలకు ఆయనే కథలను అందిస్తూ ఉంటారు. అంతేకాదు ఆయన దర్శకుడు కూడా. ఓ మాదిరి బడ్జెట్ లోని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే దర్శకుడిగా కంటే రచయితగా ఆయన ఎక్కువ సక్సెస్ అయ్యారు. తెలుగులోనే కాదు .. బాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'బజరంగీ భాయిజాన్' కథ ఆయనదే.

తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. "నాకు 'పసివాడి ప్రాణం' సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమా కథా వస్తువులో నుంచే 'బజరంగీ భాయిజాన్' పుట్టింది. రెండు దేశాల మధ్య ద్వేషాన్ని పెంచేది కాకుండా సామరస్యాన్ని పెంచేదిగా ఎందుకు సినిమా చేయకూడదు? అనే ఆలోచనతో ఆ కథను సిద్ధం చేసుకోవడం జరిగింది. యాక్షన్ కి తావు లేకుండా ఎమోషన్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. మంచితనం .. మానవత్వమే ప్రధానంగా ఈ కథ నడుస్తుంది.

ఆమీర్ ఖాన్ ఓ సినిమా షూటింగు కోసం జైపూర్ ప్యాలెస్ లో ఉండగా అక్కడికి వెళ్లి ఆయనకు కథ వినిపించాను. ఆయన ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు .. కథను చాలా శ్రద్ధగా విన్నారు. ప్యాలెస్ నుంచి రోడ్డు మీదకి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. అంత దూరం నాతో పాటు నడిచివచ్చి కారు ఎక్కించారు. దాంతో ఇక ఆయన ఆ సినిమాను చేస్తారనే అనుకున్నాను. వారం తరువాత ఆయన ఒక మెసేజ్ పెట్టారు .. తాను ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ కాలేకపోతున్నాను అని. అప్పుడు ఆ కథను సల్మాన్ కి వినిపించడం .. ఆయన చేయడం జరిగిపోయాయి" అని చెప్పుకొచ్చారు.        



Tags:    

Similar News