ఏజెంట్ ఆత్రేయ త‌ర‌హా రియ‌ల్ క్రైమ్ స్టోరి

Update: 2019-09-08 09:08 GMT
మోడ్ర‌న్ డేస్ లో క్రైమ్ విస్తుబోయేలా చేస్తోంది. అచ్చం సినిమాని త‌ల‌పించేలా ఇలా కూడా చేస్తారా? అని షాక్ కి గుర‌య్యేలా చేస్తున్నారు కొంద‌రు క్రిమిన‌ల్స్. వేలి ముద్ర‌ల మార్పిడితో కొత్త‌ ఆధార్.. కొత్త పాస్ పోర్ట్ సంపాదించి విదేశాల‌కు పారిపోయే ముఠాలు పోలీసుల విచార‌ణ‌లో వెలుగు చూస్తున్నాయి. ఈ త‌ర‌హా కేసు ఒక‌టి తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ లో బ‌య‌ట‌ప‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. ప‌శ్చిమ గోదావ‌రి- నెల్లూరు జిల్లాలకు చెందిన కొంద‌రు వ్య‌క్తులు ఒక ముఠాగా ఏర్ప‌డి త‌మ వేలి ముద్ర‌ల్ని శ్రీ‌లంక‌కు చెందిన ఒక డాక్ట‌ర్ సాయంతో మార్పిడి చేసుకున్నారని ఈ విచార‌ణ‌లో తేలింది. వేలి ముద్ర‌ల మార్పిడి కోసం డ‌బ్బు అవ‌స‌రంలో ఉన్న కొంద‌రిని తెలివిగా ట్రాప్ లో వేశారు. అలా మార్పిడి చేసిన‌ వేలు ముద్ర‌ల‌తో వీళ్లంతా కొత్త ఆధార్ ని దాంతో పాటే పాస్ పోర్టులు సంపాదించారు. ఇక విదేశాల‌కు వెళ్లాల‌న్న‌ది ప్లాన్. అయితే ఇంత‌లోనే ఈ కేసును ఎంతో చాక‌చ‌క్యంగా ఏపీ పోలీస్ ఛేదించారు.

స‌రిగ్గా ఇదే త‌ర‌హా కాన్సెప్టుతో తెర‌కెక్కిన `ఏజెంట్ సాయి శ్రీనివాస‌ ఆత్రేయ` ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కొత్త కుర్రాడు న‌వీన్ పోలిశెట్టి హీరోగా స్వ‌రూప్ ఆర్.ఎస్.జె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా విజ‌యంలో అడుగ‌డుగునా ఆస‌క్తి రేకెత్తించే క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ ప్ర‌ధాన భూమిక పోషించింది. చ‌నిపోయిన వ్య‌క్తుల‌ వేలి ముద్ర‌ల్ని త‌స్క‌రించి వాటి ద్వారా కొత్త ఐడీలు సంపాదించుకుని సాగించే అరాచ‌కం ఏమిటి? అన్న‌ది తెర‌పై ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ సినిమాని స్వ‌రూప్ ఎంతో కామిక్ పంథాలో  తెర‌కెక్కించారు. కొత్త కుర్రాళ్లే అయినా మౌత్ టాక్ తో ఈ సినిమా హిట్ట‌వ్వ‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప‌శ్చిమ గోదావ‌రి- నెల్లూరు గ్యాంగ్ పుణ్య‌మా అని ఆ వార్త కాస్తా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. ఇది అచ్చం ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ స్టోరీలానే ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. సినిమా రిలీజైన ఆర్నెళ్లు అయినా గ‌డ‌వ‌క ముందే ఏపీ పోలీస్ ఈ త‌ర‌హా కేసును స‌మ‌ర్థంగా డీల్ చేసి ముగింపు ప‌ల‌క‌డం ఆస‌క్తిక‌రం. అన్న‌ట్టు ఏజెంట్ ఆత్రేయ‌కు సీక్వెల్ ఉంటుంద‌ని న‌వీన్ పోలిశెట్టి- స్వ‌రూప్  బృందం ప్ర‌క‌టించారు. ఇప్పుడిలా వెలుగు చూసిన ఈ రియ‌ల్ క్రైమ్ స్టోరీతో సీక్వెల్ మొద‌లు పెడ‌తారేమో చూడాలి.
Tags:    

Similar News