ఇదేంటండీ అని చిరంజీవిగారు నన్నెప్పుడూ అడగలేదు!

Update: 2021-05-16 08:30 GMT
టాలీవుడ్ సీనియర్ దర్శకులలో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా చిరంజీవి హీరోగా ఆయన ఎన్నో సూపర్ హిట్స్ ను అందించారు. చిరంజీవి హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'న్యాయం కావాలి' సినిమా, నిన్నటితో 40 ఏళ్లను పూర్తి చేసుకుంది. క్రాంతికుమార్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను కోదండరామిరెడ్డి పంచుకున్నారు.

"నా మొదటి సినిమా 'సంధ్య' .. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా చూసిన నిర్మాత క్రాంతికుమార్ గారు నన్ను అభినందించారు. చిరంజీవితో తాను నిర్మించనున్న సినిమాకి దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కథలపై క్రాంతికుమార్ గారికి మంచి పట్టు ఉంది .. కథలను ఎంపిక చేసుకునే విషయంలో ఆయన నిర్ణయం కరెక్ట్ గా ఉండేది. అలా ఆయన 'న్యాయం కావాలి' సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఒకసారి దర్శకత్వ బాధ్యతలు నాకు అప్పగించిన తరువాత ఆయన ఎప్పుడూ కూడా నా వర్క్ విషయంలో కలగజేసుకోలేదు.

ఈ సినిమాకి ముందు నాకు చిరంజీవిగారితో పరిచయం లేదు. షూటింగు మొదలైన రోజునే ఆయనతో మాట్లాడాను. ఈ సినిమాలో చిరంజీవిగారి పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. 'ఇదేంటండీ నాతో నెగెటివ్ కేరక్టర్ చేయిస్తున్నారు .. నాకు ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో' అని ఆయన ఏ ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు. చాలా హ్యాపీగా .. ఎంజాయ్ చేస్తూ ఆయన ఆ పాత్రను చేశారు. ఈ సినిమా 175 రోజులు ఆడింది .. నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అయింది. ఒక రకంగా ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమా గురించి మళ్లీ ఇంతకాలానికి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News